కొన్ని సినిమాలను టచ్ చేయకూడదు.. ఈ మాటను మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఎక్కువగా క్లాసిక్ సినిమాల గురించి, హిట్ సినిమాల గురించి వింటూ ఉంటాం. అంటే ఆ సినిమాను రీమేక్ చేయొచ్చు కదా, అలాంటి పాత్రలో మీరు నటించొచ్చు కదా అని ఎవరైనా అడిగినప్పుడు ఆ హీరో కానీ, ఆ నిర్మాత కానీ, ఆ దర్శకుడు కానీ ఈ మాట అంటూ ఉంటారు. అయితే ఓ డిజాస్టర్ గురించి ఎప్పుడైనా ఈ మాట విన్నారా?
సోషల్ మీడియను మీరు బాగా ఫాలో అయ్యేవాళ్లు అయితే కచ్చితంగా ఇప్పటికే వినే ఉంటారు. లేదంటే ఇప్పుడు తెలుసుకుంటారు. ఆ మాటలు అన్నది ప్రముఖ యువ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) కాగా.. ఆ సినిమా ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వద్దు అనుకునే సినిమాల్లో ఇదొకటి. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఊహించని ఘోర పరాజయం అందుకుంది. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌కి ఉన్న బ్లాక్‌బస్టర్ ట్యాగ్ పోయింది ఈ సినిమాతోనే.
ఇదంతా ఎందుకు జరిగింది అంటే.. ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా ప్రచారం కోసం నాగవంశీ (Naga Vamsi) ఇటీవల మీడియాతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో రీరిలీజ్‌లు, వాటి ఫలితాల గురించి ప్రస్తావన వచ్చింది. అంటే రీరిలీజ్‌లు చేస్తున్న సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి ఎందుకు అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సినిమాల రీరిలీజ్‌ల విజయాలు పాటల కారణంగానే అని చెప్పారు. పాటలు విజయం సాధిస్తే సినిమా హిట్ అవుతోంది అని చెప్పారు.
దీంతో ఆ వ్యాఖ్యత మరి మీ ‘అజ్ఞాతవాసి’ సినిమాను రీరిలీజ్ చేయొచ్చు కదా అని కామెంట్ అడిగారు. దానికి నాగవంశీ (Naga Vamsi) రియాక్ట్ అవుతూ కొన్ని సినిమాలను టచ్ చేయకపోతేనే మంచిది అని కామెంట్ చేశారు. ఆయన ఉద్దేశం ఆ సినిమా రిలీజ్ చేసినా బాగా ఆడదు అనా? లేక ఇప్పుడు ఆ సినిమాతో ఎందుకా? అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ సినిమా పాటలు కూడా మంచి హిట్టయినవే.