నాగార్జున టాలీవుడ్‌లో కింగ్ అని, మన్మథుడు అని క్లాస్ నేమ్స్‌తోనే పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న పాత్రలు అలానే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఆయన మాస్ సినిమాలు చేసినా ఆయన ఇమేజ్ మాత్రం అక్కడి నుండి దాటి రావడం లేదు. ‘కిల్లర్’గా కనిపించినా మన్మథుడు కిల్లర్ అయ్యాడనే అంటారు. అయితే ఇప్పుడు ‘సైమన్’తో తన ఇమేజ్ మొత్తం మార్చేసుకునే ఆలోచనలో ఉన్నారా? ఏమో ఆయన రీసెంట్ కామెంట్స్ వింటుంటే అలానే అనిపిస్తోంది.
ఇప్పుడు ‘కూలీ’ సినిమాలో తాను చేస్తున్న పాత్ర గురించి తన మనవళ్లకు అస్సలు తెలియనివ్వను అని నాగార్జున అంటున్నారు. ‘కూలీ’ సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపిస్తాను. ఈ పాత్ర గురించి మనవళ్లకు కచ్చితంగా చెప్పాలనుకోవడం లేదు అని సరదాగా అన్నారు నాగ్. ఎందుకంటే ఈ పాత్ర అంత బ్యాడ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. నాగార్జున ఇంత కచ్చితంగా చెబుతున్నారు.. మరోవైపు లోకేశ్ కనగరాజ్ విలన్స్ చాలా క్రూయల్‌గా ఉంటారు. ఈ లెక్కన సైమన్‌తో మామూలుగా ఉండదు అని అర్థమవుతోంది.
మొన్నీమధ్య ఓ ఈవెంట్‌లో నాగార్జునను రజనీకాంత్ తెగ పొగిడేశారు. పాత్రల ఎంపిక గురించి, నటన గురించి, ఫిట్‌నెస్ గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు రజనీకాంత్‌పై నాగ్ ప్రశంసలు కురిపించారు. రజనీతో పని చేయడం అద్భుతమైన అనుభవం. సెట్‌లో ఆయన ఉంటే ఆ సందడే వేరు. సినిమా కోసం తమిళంలో డైలాగులు చెప్పే విషయంలో సాయం చేశారు. నేను ఎంత నెగిటివ్ రోల్‌లో కనిపించినప్పటికీ ఆయన దాన్ని సెట్‌లో అంత పాజిటివ్‌గా మార్చేశారు అని పొగిడేశారు నాగ్.
ఇక సినిమా విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ, నాగ్‌తోపాటు శ్రుతి హాసన్, సౌబిన్ సాహిర్, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులు. ‘మోనిక..’ సాంగ్‌తో పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల చేయనున్నారు.