Nagarjuna: ‘బింబిసార’ ‘సీతా రామం’ చిత్రాల పై నాగార్జున కామెంట్స్ వైరల్..!

‘సీతా రామం’ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 6 రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి ‘సీతా రామం’ కాస్ట్ అండ్ క్రూ ని అభినందించారు. నాగార్జున మాట్లాడుతూ..”అశ్వినీదత్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కంటే నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు స్వప్న, ప్రియాంక. వాళ్ళిద్దరూ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. దత్ గారికి వారిద్దరూ పెద్ద అండ. ‘మహానటి’ , ‘జాతి రత్నాలు’, ఇప్పుడు ‘సీతా రామం’ ..ఇలా వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.

‘వైజయంతి బ్యానర్’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న స్వప్న, ప్రియాంకకి కృతజ్ఞతలు. ‘వైజయంతి’ బ్యానర్ లో నేను 5 సినిమాలు చేశాను.ఈ బ్యానర్ పై ఎన్టీఆర్ గారి ఫోటో ఉంటుంది. అలాగే నాన్నగారు, చిరంజీవి గారు ‘వైజయంతి’ లో చిత్రాలు చేశారు. ఈ బ్యానర్లో సినిమాలు చేయని వారంటూ లేరు. వైజయంతి పేరుని స్వప్న, ప్రియాంక నిలబెడుతున్నారు. ఇక ‘సీతా రామం’ చూసి చాలా జలసీ ఫీలయ్యాను.ఎందుకంటే… నాకు రావాల్సిన రోల్ దుల్కర్ కి వెళ్ళింది(నవ్వుతూ). ‘గీతాంజలి’, ‘సంతోషం’, ‘మన్మధుడు’ వంటి రోజులు గుర్తుకొచ్చాయి. ‘సీతా రామం’ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రొమాన్స్ ఈజ్ బ్యాక్. లవ్, రొమాన్స్ చిత్రాలని ప్రేక్షకులు మళ్ళీ గొప్పగా ఆదరించారు.

దర్శకుడు హను చాలా డీటైల్డ్ గా, అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు.సినిమా స్లోగా స్టార్ట్ అయినా, ఇంటర్వెల్ పాయింట్ లో ప్రేక్షకులను ఎవరూ ఊహించని రీతిలో లాక్ చేశారు. సెకండ్ హాఫ్ అత్యద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి. పాటల చిత్రీకరణ కూడా చాలా అందంగా వుంది. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులవుతుంది. ఈ క్రెడిట్ అంతా దర్శక నిర్మాతలు చిత్రం కోసం పని చేసిన అందరికీ దక్కుతుంది. హీరోయిన్ మృణాల్ పాత్రతో ప్రేమలో పడిపోయా. అంత అందంగా ఉంది. ఎవరైనా ఆ పాత్రతో ప్రేమలో పడాల్సిందే. దుల్కర్ గొప్ప ఛార్మింగ్ ఉన్న నటుడు. దుల్కర్ ని చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది.

అంత గొప్ప ప్రజన్స్ దుల్కర్ లో ఉంది. దుల్కర్ లో ఆ స్వచ్ఛత ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటాను.ఇక తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పాలి. మీకు నిజంగా పాదాభివందనాలు.మేము సినిమా చూడము అని ఎప్పుడన్నాము,సినిమా బాగా తీయండి చూస్తాము అన్నాము. గత వారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు.’సీతా రామం’ కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని స్వప్న చెప్పడం ఆనందంగా ఉంది. అశ్విని దత్ గారు సినిమా థియేటర్ కి మళ్ళీ ఆడియన్స్ ని తీసుకొచ్చి మా అందరికీ మళ్ళీ నమ్మకం కలిగించారు. ‘సీతా రామం’ ని ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus