మన్మధుడు సీక్వెల్ ను స్టార్ట్ చేయనున్న అక్కినేని నాగార్జున

‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత మరో సరైన హిట్‌ కోసం నాగార్జున ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన ‘రాజుగారి గది 2, ఆఫీసర్‌’ పరాజయం చెందాయి. ఇటీవల ఆయన నటించిన మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’ కూడా కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించుకుంది. దీంతో ఇప్పుడాయన ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు ధనుష్‌తో కలిసి ద్విభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాలను కుంటున్నట్టు ఇటీవల నాగ్‌ తెలిపారు.

‘మన్మథుడు’ తరహాలో ఈ సినిమా కథ ఉంటుందట. దీనికి ‘మన్మథుడు 2’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టు కూడా వార్తలు వినిపించాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌లో కూడా ఈ టైటిల్‌ని కూడా రిజిస్టర్‌ చేశారట. అంతేకాదు స్క్రిప్ట్‌ కూడా ఫైనల్‌ అయినట్టు తెలుస్తోంది. ధనుష్‌తో చేసే సినిమా కంటే ముందే ‘మన్మథుడు 2’ని జనవరిలో స్టార్ట్‌ చేయాలని నాగార్జున భావిస్తున్నారట. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారి ఇటీవల ‘చిలసౌ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయినప్పటికీ దర్శకుడిగా రాహుల్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఇక మరోవైపు నాగార్జున కోసం ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్‌ కళ్యాణ్‌ కృష్ణ ‘బంగార్రాజు’ అనే కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus