సమంతను దెయ్యంలా చూడాలని ఎప్పుడూ అనుకోలేదు!! : అక్కినేని నాగార్జున

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ఏర్పరుచుకొన్న నాగార్జున త్వరలో “రాజుగారి గది 2″తో మరోమారు ప్రేక్షకుల ముందుకురానున్నాడు. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నిజానికి సెప్టెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డిలే అయ్యింది. సినిమా రిలీజ్ లేట్ అవ్వడం మొదలుకొని ప్రొజెక్ట్ అవుట్ పుట్, నాగచైతన్య-సమంతల పెళ్లి, తదుపరి ప్రొజెక్ట్స్ వివరాలు ఇలా చాలా విషయాల గురించి మీడియాతో ముచ్చటించారు నాగార్జున. ఆ విశేషాలు మీకోసం..!!

సరదాగా ట్రై చేశా..
నేను మీసం తీసేయడం గురించి అందరూ తెగ అడుగుతున్నారు. కొత్త సినిమా గెటప్పా అని కూడా కొందరు, నాగచైతన్య-సమంతల పెళ్లి కోసమా అని ఇంకొందరు అడుగుతున్నారు. ఏదో సరదాగా మీసాలు తీసేసానే తప్ప వేరే ఏం లేదు.

అక్టోబర్ చాలా స్పెషల్..
ముందే చెప్పినట్లుగా ఈ ఏడాది అక్టోబర్ నా జీవితంలో చాలా స్పెషల్. నేను చాలా ఇష్టపడి నటించిన “రాజుగారి గది 2” సినిమా రిలీజ్ అవుతుంది, నాగచైతన్య-సమంతల పెళ్లి జరుగుతోంది. అఖిల్ రెండో సినిమా “హెల్లో” షూటింగ్ పూర్తికావొచ్చింది. అన్నిటినీ మించి ఏయన్నార్ అవార్డ్ ను రాజమౌళికి బహూకరించడం వంటివి ఎప్పటికీ మరువలేను.

అర్ధం తెలుసుకోమంటున్నాను..
నాగచైతన్య-సమంతల పెళ్లి ఎలా జరగాలి అనే విషయంలో నేను ముందు నుంచీ ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే.. పెళ్లి అనేది ఏదో కంగారుగా కాకుండా పెళ్లి అర్ధం తెలుసుకొని చేసుకోవాలని మాత్రం కోరుకొన్నాను. నిజానికి నేను అమల చేసుకొన్నట్లుగా ఆర్య సమాజ్ లో నాగచైతన్య-సమంతల పెళ్లి కూడా అదే తరహాలో జరగాలనుకొన్నాను. అక్కడ కాకపోతే ఇంట్లోనే కేవలం బంధువుల సమక్షంలో జరగాలనుకొన్నాను. కానీ.. నాగచైతన్య కోరిక మేరకు గోవాలో హిందూ మరియు క్రిస్టియన్ పద్ధతుల్లో జరగనుంది.

వంద మంది కూడా ఉండరు..
గోవాలో జరగబోయే పెళ్ళికి కేవలం నాకు అత్యంత సుపరిచితులైన బంధువులు మాత్రమే హాజరుకానున్నాను. అక్కినేని & దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి 100 మంది కూడా ఉండరు. అయితే.. నాకు మాత్రం చాలా సరదాగా ఉంది, ఎందుకంటే హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగే పెళ్ళిలో పంచె కట్టుకోవచ్చు, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగే పెళ్ళిలో సూటేసుకోవచ్చు.

ఓంకార్ వల్లే లేట్ అయ్యింది..
సెప్టెంబర్ రెండోవారంలోనే మా సినిమాని రిలీజ్ చేద్దామనుకొన్నాం కానీ సీజీ వర్క్ అవుట్ పుట్ అనుకొన్నట్లుగా రాకపోవడంతో నేను డబ్బింగ్ చెప్పలేదు. డబ్బింగ్ చెబితే ఎక్కడ సినిమా రిలీజ్ చేసేస్తారో అన్న భయంతోనే డబ్బింగ్ చెప్పనన్నాను. సీజీ వర్క్ విషయంలో సంతృప్తి చెందాకే డబ్బింగ్ చెప్పాను. ఇదంతా కూడా సీజీ వర్క్ ను బొంబాయిలో వొద్దు అని చెప్పినా వినకుండా ఓంకార్ పట్టుబట్టి మరీ అక్కడే చేయించాడు. అందువల్ల ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడం, సినిమా లేట్ అవ్వడం జరిగింది.

కథ-కాన్స్పెట్ నచ్చి ఒకే చేశాను..
ఓంకార్ చెప్పిన కథతోపాటు ఆ కథను డీల్ చేసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. అందుకే ఇమ్మీడియట్ గా స్టోరీ ఒకే చేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండబోతోంది. మెంటలిస్ట్ గా నా రోల్ ను ఆడియన్స్ విశేషంగా ఎంజాయ్ చేస్తారు.

సమంతను అలా ఎప్పుడూ చూడాలనుకోలేదు..
ఈ సినిమాలో ఆ ఘోస్ట్ క్యారెక్టర్ కు సమంతే ఫస్ట్ ఛాయిస్. అయితే.. నా కోడల్ని దెయ్యంలా ఎప్పుడూ చూడాలనుకోలేదు. నాగచైతన్య అయితే సినిమా రిలీజయ్యాక “నేను ఆ సినిమా చూడను” అంటూ ముందే చెప్పేశాడు.

నానీతో సినిమా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది..
“భలే మంచి రోజు” ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడు. అందులో నాతో నానీ కూడా యాక్ట్ చేయనున్నాడు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిమ్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. నా క్యారెక్టర్ అంత కొత్తగా ఉండబోతోంది.

జనాలు నన్ను కొత్తగా చూడాలనుకొంటున్నారు..
“ఊపిరి” తర్వాత నుంచి నా నుంచి ఆడియన్స్ కొత్త క్యారెక్టర్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దర్శకులు కూడా ఇప్పుడిప్పుడే డైరెక్టర్స్ కూడా కొత్త కథనాలతో, సరికొత్త క్యారెక్టరైజేషన్స్ తో నా వద్దకు వస్తున్నారు.

ప్రెజర్ మొత్తం విక్రమ్ కుమార్ మీదే..
“హెల్లో” సినిమా షూటింగ్ నిజానికి అక్టోబర్ 15కి పూర్తికావాల్సి ఉంది కానీ వర్షాల కారణంగా లేట్ అవ్వోచ్చు. సో, డిసెంబర్ రిలీజ్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ ఎండ్ వరకు సినిమా ఫస్ట్ కాపీ పూర్తి చేయాలని విక్రమ్ కుమార్ కి చెప్పేశాను. షూటింగ్ విషయంలో ఎక్కడా ఫోర్స్ చేయడం లేదు కానీ రోజుకి రెండుసార్లు ఫోన్ మాత్రం చేస్తున్నాను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus