క్రియేటివ్ జీనియస్ దర్శకత్వంలో కొంతకాలం విరామం అనంతరం తెరకెక్కించిన చిత్రం “నక్షత్రం”. సందీప్ కిషన్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం పోలీస్ బ్యాడ్రాప్ లో రూపొందిన యాక్షన్ డ్రామా. రెజీనా, ప్రగ్యాజైస్వాల్, శ్రియ వంటి అందాల భామలు తళుక్కున మెరిసిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ప్రత్యేకపాత్ర పోషించాడు. ఇంతమంది తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది, కృష్ణవంశీ తన ఫ్లాపుల పరంపర నుండి ఇప్పటికైనా బయటపడ్డాడా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!
కథ : రామారావు (సందీప్ కిషన్) ఎస్.ఐ ఉద్యోగం సంపాదించి దేశానికి సేవ చేయాలని తపనపడే యువకుడు. అందుకోసం అనునిత్యం పరితపిస్తూ.. ఒకపక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూనే, తనకు కుదిరినప్పుడల్లా పోలీసులకు సహాయపడుతుంటాడు. రాత పరీక్ష పాసై సరిగ్గా ఫిజికల్ టెస్ట్ కోసం బయలుదేరిన రామారావును అడ్డుకొని అతడు సమయానికి చేరుకోకుండా అడ్డుపడతాడు. పోలీస్ అవ్వలేకపోయినా కనీసం పోలీస్ డ్యూటీ అయినా చేద్దామనే ఉద్దేశ్యంతో తన గర్ల్ ఫ్రెండ్ జమున (రెజీనా) ఇచ్చిన పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీసులు లేని చోట డ్యూటీ చేస్తుంటాడు.
అలా సీక్రెట్ డ్యూటీ చేస్తున్న రామారావు, అనుకోకుండా టెర్రరిస్ట్ గ్యాంగ్ లీడర్ అయిన ముక్తార్ ను పట్టుకొని ఓ బాబ్ బ్లాస్ట్ ను ఆపుతాడు. అయితే.. ఈ గొడవలో రామారావును చూసి “అలెగ్జాండర్” అనుకొంటారు ప్రకాష్ రాజ్ అండ్ టీం. అలెగ్జాండర్ ఎవరు? రామారావు పట్టుకొన్న ముక్తార్ అలెగ్జాండర్ గురించి ఎలాంటి విషయాలు చెప్పాడు. ఈ కథలో కమీషనర్ కొడుకు రాహుల్ (తనీష్) పాత్ర ఎలాంటిది? అనేది “నక్షత్రం” సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటుల పనితీరు : రామారావు పాత్రలో సందీప్ కిషన్ ఎమోషనల్ యంగ్ మేన్ గా పాత్రకి న్యాయం చేశాడు. కాకపోతే.. కొన్ని సీన్స్ లో ఎమోషన్ కంటే సందీప్ కిషన్ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల అతడి నటన అతి అనిపించకమానదు. రెజీనా జమున అనే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పాత్రలో నటించడం కంటే.. సెన్సార్ సభ్యులు ఇబ్బందిపడనంతలో వెండితెరపై తన తనువందాలను తెరచాపలా పరచడానికే ఎక్కువ ఆస్కారం లభించింది. దాంతో.. ఏమాత్రం మొహమాటపడకుండా సందీప్ కిషన్ తో ఉరనాటు రొమాన్స్ చేస్తూనే నడుమందాలు చూపిస్తూ కాస్త నోరూరించడానికి ప్రయత్నించింది. మాస్ ఆడియన్స్ వరకూ పర్లేదు కానీ.. మిగతా ప్రేక్షకులు అమ్మడు అతిగా చూపించిన అందాలు చూడ్డానికి కాస్త ఇబ్బందిపడాల్సిందే.
రెజీనానే రెచ్చిపోయింది అనుకొంటే.. ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోతలో మునుపెన్నడూ లేని విధంగా శృతిమించి భంగపడింది. “ఏం పాప..” అనే పాటలో బికినీ తప్ప అన్నీ రకాల బట్టలేసుకొని భీభత్సమైన భంగిమల్లో యద లోతులు మొదలుకొని తొడ సౌందర్యాల వరకూ బహిర్గతపరుస్తూ తన ఉనికిని చాటుకోడానికి భీభత్సంగా ప్రయత్నించింది. సాయిధరమ్ తేజ్ ది చిన్న పాత్రే అయినా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. అయితే.. క్యారెక్టర్ కి లాజిక్ లేకపోవడంతో ఇది కూడా మైనస్ గా మారింది. తనీష్ నెగిటివ్ రోల్ లో డ్రగ్ ఎడిక్ట్ గా దాదాపు జీవించేశాడు. పోలీస్ కమిషనర్ గా ప్రకాష్ రాజ్, కానిస్టేబుల్ గా శివాజీరాజా, తల్లి పాత్రలో తులసిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : ఏదైనా సినిమాకి మ్యూజిక్కో లేక సినిమాటోగ్రఫీనో మరీ అనుకొంటే బ్యాగ్రౌండ్ స్కోరో మైనస్ గా చెప్పొచ్చు. కానీ.. నక్షత్రం సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి అందించిన సంగీతం కానీ.. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఏమాత్రం సింక్ అవ్వలేదు. వీటికితోడు శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ పాటలు మినహా ఏ సన్నివేశామూ ఆకట్టుకొనే రీతిలో లేకపోవడం, కొన్ని సన్నివేశాల ఔట్ పుట్ చాలా వీక్ గా ఉండడం వల్ల ప్రేక్షకుడు చాలా ఇబ్బందిపడుతుంటాడు.
బేసిక్ గా కృష్ణవంశీ రాసుకొన్న కథకి హాలీవుడ్ సినిమా “ది న్యూ పోలీస్ స్టోరీ” అనేది ఇన్స్పిరేషన్. ఆ సినిమా మూల కథను తెలుగుకు తగ్గట్లుగా మార్పులు చేసి “నక్షత్రం” స్క్రిప్ట్ ను రాసుకొన్న కృష్ణవంశీ.. సదరు కథను స్క్రీన్ పై రీప్రెజంట్ చేయడంలో కొత్తదనం చూపించకుండా 90ల కాలం నాటి స్టోరీ టెల్లింగ్ ప్రొసీజర్ ను ఫాలో అవ్వడం.. ఎప్పట్లానే పాత్రధారుల చేత భారీ ఎమోషన్స్ ను పండించి ప్రేక్షకులు ఆ ఎమోషన్ కు కనెక్ట్ కావాలని తాపత్రయపడడంతో “ఇక వంశీగారి మేకింగ్ లో మార్పు రాదా” అనిపించకమానదు. అవసరం లేని చోట కూడా పదుల సంఖ్యలో ఆర్టిస్టుల్ని సీన్ లో ఇరికించి, ఎక్కువ షాట్స్ తీయడానికి కారణం ఏంటో ఆయనకే తెలియాలి. ఒక బాంబ్ బ్లాస్ట్ లో అది కూడా పబ్లిక్ మార్కెట్ లో ఓ సీనియర్ పోలీస్ అధికారి చనిపోతే.. దానికి సంబంధించిన రికార్డ్ పోలీసుల దగ్గరే లేకపోవడం హాస్యాస్పదమైన విషయం. ఇలాంటి లాజిక్స్ సినిమాలో చాలా చోట్ల మిస్ అయ్యాడు కృష్ణవంశీ.
విశ్లేషణ : మేకింగ్ విషయంలో భారీతనాన్ని ఫాలో అవుతున్న కృష్ణవంశీ.. కంటెంట్ విషయంలోనూ అదే భారీతనాన్ని అలవారుచుకోకపోతే నేటితరం ఫిల్మ్ మేకర్స్ తో పోటీపడడం ఇంపాజబుల్. ఇప్పటికైనా ఆయన శైలిని మార్చుకోకపోతే ప్రేక్షకులు పగలే ఇంకొన్ని “నక్షత్రాల్ని” చూడాల్సి వస్తుంది. త్వరలోనే ఆయనలో ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.
రేటింగ్ : 1.5/5