నందమూరి తారకరత్న మరణంతో నందమూరి – నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న.. ఫిబ్రవరి 18న కన్నుమూశారు.. కోలుకుని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు.. వారి ప్రార్థనలు ఫలించలేదు.. 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. తారక రత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ పరిశ్రమ వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు..
తారక రత్న బాబాయ్, ఒకప్పటి నందమూరి హీరో నందమూరి కళ్యాణ చక్రవర్తి కూడా వచ్చారు.. స్వర్గీయ ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమ రావు కొడుకే ఈయన.. 1986 నుండి 1994 వరకు హీరోగా సినిమాలు చేశారు.. ‘అత్తగారు స్వాగతం’, ‘అత్తగారు జిందాబాద్’, ‘మామా కోడళ్ల సవాల్’, ‘ఇంటిదొంగ’, ‘అక్షింతలు’, ‘కృష్ణ లీల, ’ రౌడీ బాబాయ్’, ‘దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’, ‘తలంబ్రాలు’, ‘ప్రేమ కిరీటం’, ‘జీవన గంగ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.. కేవలం కథానాయకుడిగానే కాకుండా.. కీలక పాత్రల్లోనూ కనిపించారు..
ముఖ్యంగా కళ్యాణ చక్రవర్తిని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించి.. ఆ తరహా కథలతో చిత్రాలు చేశారు కానీ వర్కౌట్ కాలేదు.. మంచి హైట్, పర్సనాలిటీ, హీరోగా నిలదొక్కుకునే అవకాశమున్నా కానీ సరైన సినిమా పడకపోవడం.. నందమూరి కుటుంబం సపోర్ట్ ఉన్నా కానీ కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయారాయన.. బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ చెన్నైలోనే స్థిర పడిపోయారు కళ్యాణ చక్రవర్తి..
చాలా కాలం తర్వాత ఆయన తారక రత్న మరణించడంతో హైదరాబాద్ విచ్చేశారు.. తారక రత్న నివాసం వద్ద కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లను కళ్యాణ చక్రవర్తి పలకరిస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.. చాలా కాలం తర్వాత నందమూరి కళ్యాణ చక్రవర్తి కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్.. ‘గుర్తు పట్టలేనంతగా మారిపోయారే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.