పరిశ్రమలో సెకెండ్ హీరో అన్న పదం వినిపించడం మానేసి చాలా కాలం అయ్యింది. చిన్న పెద్ద హీరోలందరూ తమ తమ సినిమాలు చేసుకుంటున్నవారే. సెకెండ్ హీరో సంప్రదాయం పోయి ఒక హీరో సినిమాలో మరో హీరో కనపడాల్సి వస్తే.. అతిథి పాత్ర, ఫుల్ లెంగ్త్ రోల్ అయితే మల్టీ స్టారర్ అన్న ట్రెండ్ మొదలయింది. అయితే ఎప్పుడో ఓసారి కొన్ని సినిమాల్లో హీరో తర్వాత హీరో లాంటి పాత్ర అని అనిపిస్తుంటుంది. అలా ఇప్పటి జనరేషన్ లో సెకెండ్ హీరోగా ఎవరైనా ఉన్నారంటే అది నందూనే.పెసరట్టు, పాఠశాల, 365 డేస్ వంటి చోటా సినిమాల్లో హీరోగా నటించే నందూ 100% లవ్, ఆటోనగర్ సూర్య, సహా ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచినా పెళ్లి చూపులు సినిమాల్లో సెకెండ్ హీరోగా నటించాడు.
మొత్తంగా తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని చేజారనివ్వకుండా చూసుకునే ఈ హీరో సోలో హీరోగా వంశీకృష్ణ ఆకేళ్లతో ఓ కొత్త సినిమా మొదలెట్టాడు. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుంది కదూ..! మూడు నెలల కిందట సునీల్ ని ‘జక్కన్న’గా ముస్తాబు చేసి థియేటర్లోకి తీసుకొచ్చింది ఇతగాడే. ఇంకాస్త వెనక్కి వెళితే.. 2008లో రామ్ గోపాల్ వర్మ ‘ఫూంక్’ సినిమాని ‘రక్ష’గా రీమేక్ చేశాడు. ఎనిమిదేళ్ళ తర్వాత రెండో సినిమా చేసిన వంశీ సునీల్ కి మరో ప్లాప్ అంటగట్టాడు. చిన్నవో పెద్దవో చేసిన సినిమాలతో కొద్దో గొప్పో గుర్తింపు తెచ్చుకుంటున్న నందూ వంశీతో సినిమా చేయడం అతడి కెరీర్ ని ఎటు తిప్పుతుందో మరి..!