మార్చి చివరలో బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో రచ్చ జరుగుతుందని అందరూ వెయిట్ చేశారు. నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకేసారి థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరగాల్సిన బాక్సాఫీస్ వార్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా మార్చి రేసు నుంచి తప్పుకున్నట్లు తాజాగా క్లారిటీ వచ్చేసింది.
ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. దీంతో రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ కి సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందట. ఇప్పటి వరకు కేవలం 60 రోజులు మాత్రమే చిత్రీకరణ జరిగిందని, ఇంకా మరో 60 రోజుల షూట్ చేయాల్సి ఉందని నిర్మాత చెప్పారు. జనవరి సగం అయిపోవస్తున్న టైమ్ లో.. ఇంకో రెండు నెలల షూటింగ్ అంటే మార్చి 26న రిలీజ్ చేయడం అసాధ్యమని మూవీ టీమ్ డిసైడ్ అయ్యింది.
అయితే నాని ఫ్యాన్స్ మాత్రం వర్రీ అవ్వాల్సిన పని లేదు. మార్చిలో రాకపోయినా.. వేసవి సెలవుల్లో ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తామని నిర్మాత హింట్ ఇచ్చారు. సమ్మర్ సీజన్ లో ఒక మంచి డేట్ చూసి ‘ది ప్యారడైజ్’ ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా మాత్రం చెప్పిన టైమ్ కే వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మార్చి 27 డేట్ నే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా పూర్తి చేసి పక్కాగా ఆ డేట్ కి రావాలని చరణ్ టీమ్ గట్టిగా ట్రై చేస్తోంది. ఇక నాని సినిమా మే నెలలో రావచ్చని మరొ టాక్ వినిపిస్తోంది.