నారా రోహిత్, రెజీనా జంటగా ‘శంకర’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిన సంగతి గుర్తుందా..? తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని విడుదల చేయటానికి నిర్మాతలు రెండేళ్ళుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఉన్న రోహిత్ 2011లో విడుదలైన తమిళ హిట్ సినిమా ‘మౌనగురు’ రీమేక్ చేసి ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నాడు.మొన్నటికి మొన్న సెప్టెంబర్ 16 సహా పలు తేదీలు ఈ సినిమా పోస్టర్ పైకి ఇలా వచ్చి ఆలా అదృశ్యమయ్యాయి. ఈ గ్యాప్‌లో సినిమాలో నటించిన ఇద్దరు నటులు (ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ) పరమపదించారు కూడా.
మళ్ళీ ఈ నెల 21 ఈ సినిమా విడుదలవుతుందంటూ వార్తల్లోకొచ్చిందీ చిత్రం. ఈ ఏడాది విడుదలైన నాలుగు సినిమాల్లో మూడు పరాజయాల తర్వాత ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రోహిత్ కి ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇదే కథతో మురుగదాస్ తీసిన ‘అకీరా’ మెజారిటీ ఆడియన్స్ చూసేశారు. పాచిపోయిన వంటకం మాదిరి తయారైంది ఈ సినిమా పరిస్థితి. మరోవైపు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచారం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంచేత ‘శంకర’ సినిమా విడుదలైతే రోహిత్ నటించిన సినిమా విడుదల కాకుండా ఉండిపోయింది అన్న మచ్చ పోతుంది తప్పితే అంతకుమించి ఒరిగేదేమీ లేదు. అయితే ఈసారైనా శంకరుడు దర్శనమిస్తాడా? అంటే.. అది పైనున్న శంకరుడికే తెలియాలి.