నారప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

ధనుష్ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన “అసురన్” సంచలన విజయం సాధించడమే కాక ధనుష్ కి నేషనల్ లెవల్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను తెచ్చిపెట్టింది. ఆ సినిమాకి రీమేక్ గా రూపొందిన చిత్రమే “నారప్ప”. యూత్ ఫుల్ & ఎమోషనల్ మూవీస్ స్పెషలిస్ట్ శ్రీకాంత్ అడ్డాల దాదాపు అయిదేళ్ళ తర్వాత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ టైటిల్ పాత్ర పోషించారు. థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, ఒటీటీలో విడుదల చేశారు. నేడు (జూలై 20) అమేజాన్ ప్రైమ్ లో “నారప్ప” విడుదలైంది. మరి నారప్పగా వెంకీ ఏం చేశాడో చూద్దాం..!!

కథ: అనంతపూర్ లోని ఓ కుగ్రామంలో మూడెకరాల పొలంలో సాగు చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడిపేస్తుంటాడు నారప్ప (వెంకటేష్). అతని సతీమణి సుందరమ్మ (ప్రియమణి), పెద్ద కొడుకు మునికన్న (కార్తీక్ రత్నం) మాత్రం మాటకు మాట, దెబ్బకు దెబ్బ అనే రీతిలో ఉంటారు. మునికన్న జంకనితనం ఊరి పెద్దల్లో ఒకడైన మునిస్వామికి నచ్చదు. మోటార్ నీళ్ళ కోసం మొదలైన గొడవ, మునికన్నను అతి క్రూరంగా చంపే దాకా వెళ్తుంది.

ఈ పేద-ధనిక వ్యత్యాసం వల్ల నారప్ప ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నారప్ప ఏం చేశాడు? అనేది సినిమా కథ-కథనం.

నటీనటుల పనితీరు: కచ్చితంగా వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్ గా “నారప్ప”ను చెప్పుకోవచ్చు. వెంకీ ఇదివరకు కూడా ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా పండించినప్పటికీ.. ఈ సినిమాలో కొడుకు మీద వల్లమాలిన ప్రేమను కనబరిచే తండ్రిగా, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తాపత్రయపడే పెద్దగా అద్భుతమైన నటనతో అలరించాడు. ఊర్లో జనాల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరే సన్నివేశం కావచ్చు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కొడుకును చూసి బాధపడే సన్నివేశం కావచ్చు.. వెంకటేష్ కళ్ళల్లో నీరు చూసి ప్రేక్షకుడి గుండె కూడా బరువెక్కుతుంది. అలాగే.. యాక్షన్ ఎపిసోడ్స్ లో రౌద్రాన్ని కూడా అదే స్థాయిలో పండించాడు వెంకటేష్. ముఖ్యంగా సెకండాఫ్ లో యంగ్ నారప్ప తన కుటుంబాన్ని కాల్చేసిన వాళ్ళను నరికి చంపే సన్నివేశంలో ధనుష్ కంటే కూడా అద్భుతంగా చేశాడు వెంకటేష్.

ప్రియమణికి ఈ తరహా పాత్రలు కొత్త కాదు. తన కెరీర్ మొదటి నుంచి ఈ ఫార్మాట్ రోల్స్ చాలా చేసింది. ఈ సినిమాలో ఆమె క్యాస్టింగ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. వెంకటేష్ తో సమానమైన స్క్రీన్ ప్రెజన్స్ కలిగిన ప్రియమణి ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది.

“కేరాఫ్ కంచరపాలెం” ఫేమ్ కార్తీక్ రత్నం ఈ చిత్రంతో నటుడిగా తన విశ్వరూపాన్ని చూపించాడు. యంగ్ యాక్టర్స్ లో క్యారెక్టర్ ను అండర్ ప్లే చేస్తూ ఎమోషన్స్ ను పండించడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. మునికన్న పాత్రకు కార్తీక్ రత్నం తప్ప మరో ఆప్షన్ ఆలోచించడానికి కూడా మనసు రాదు.

రాజీవ్ కనకాల, రావు రమేష్, బ్రహ్మాజీ ఇలా తెలుగు నటులందరూ తమ తమ పాత్రలకు పర్ఫెక్ట్ గా న్యాయం చేస్తే.. ఎరికోరి తెచ్చుకున్న తమిళ నటులు సినిమాకి మైనస్ గా నిలిచారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల “అసురన్” థీమ్ ను పూర్తిగా మార్చేశాడు. తమిళ వెర్షన్ లో దళితుల బాధలను, ఇబ్బందులను, అగ్ర కులం వాళ్ళ అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కితే.. తెలుగులో శ్రీకాంత్ అడ్డాల సినిమాని పేద-ధనిక విబేధాలుగా మార్చేశాడు. అందువల్ల సినిమా మెయిన్ థీమ్ దెబ్బతినేసింది. అలాగే.. సినిమాలోని కీలకపాత్రల కోసం పరాయి భాషా నటులను ఎంపిక చేయడం కూడా మైనస్ అయ్యిందనే చెప్పాలి. తమిళ సినిమాకి రీమేక్ గా తీసిన తెలుగు సినిమాలో మళ్ళీ అదే తమిళ నటులను ఎందుకు తీసుకున్నారు అనేది అర్ధం కానీ ప్రశ్న. అలాగే.. వెంకటేష్ మేనకోడలిగా అమ్ము అభిరామిని క్యాస్ట్ చేయడం పెద్ద బ్లండర్. 60 ఏళ్ల వెంకటేష్ పక్కన 20 ఏళ్ల అభిరామి కూతురిలా కనిపించిందే కానీ హీరోయిన్ గా అగుపించలేదు.

శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉన్నా.. సినిమా థీమ్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయలేకపోయింది. ఎమోషనల్ సీన్స్ కి, ఫ్లాష్ బ్యాక్ కి కనీసం టింట్ అయినా మార్చాల్సింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ లో చాలా తప్పులు దొర్లాయి కానీ.. అవి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.

విశ్లేషణ: అసురన్ ని ఒకటికి రెండుసార్లు చూసినవాళ్ళకి కూడా నచ్చే సినిమా “నారప్ప”. అనవసరమైన గోడవ ఎందుకని లేపేసిన మెయిన్ థీమ్ ను పక్కనపెడితే, కంటెంట్ పరంగా న్యాయం చేశాడు నారప్ప. వెంకీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, కార్తీక్ రత్నం, ప్రియమణిల అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్ హైలిట్స్ గా “నారప్ప” ఒటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. వెంకటేష్ అభిమానుల్ని అలరిస్తుంది. ఓవరాల్ గా శ్రీకాంత్ అడ్డాల మాస్ ఎలివేషన్స్ ను కూడా బాగానే తీయగలడు అని ప్రూవ్ చేసిన సినిమా “నారప్ప”.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus