ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ బావమరిది, యువ కథానాయకుడు నార్నె నితిన్ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానితో నితిన్ ఏడడుగులు నడిచాడు. వివాహ వేడుకలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు అతిథుల్ని సాదరంగా ఆహ్వానించారు. ఎన్టీఆర్ తనయులు అభయ్, భార్గవ్ పెళ్లిలో సందడి చేశారు.
నార్నే నితిన్‌కు నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి, దగ్గుబాటి కుటుంబీకులు హాజరయ్యారు. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ కుటుంబంతో లక్ష్మీ శివానీ కుటుంబానికి దగ్గర బంధుత్వం ఉందని సమాచారం. ఇక నితిన్ విషయానికొస్తే.. 2023లో ‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత ‘ఆయ్’ సినిమాతో అదరగొట్టాడు.
ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రశాంత్ నీల్ సినిమా (రూమర్డ్ టైటిల్ డ్రాగన్) చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. నిజానికి ఈ పాటికే సినిమా కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉన్నా ఎన్టీఆర్ గాయం, ప్రశాంత్ నీల్ వ్యక్తిగత పనుల వల్ల ఆలస్యమైంది. ఈ నెలాఖరులో షెడ్యూల్ మొదలవుతుంది అని నిర్మాత మైత్రి రవిశంకర్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ ఆఖరున రావాల్సిన సినిమా ఆలస్యమవుతుంది అని సమాచారం.