ఒకే కాన్సెప్ట్.. రెండు సినిమాలు. ఒకే తరహా కథ.. రెండు చిత్రాలు. ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. ఇందులో ముందుగా వచ్చిన సినిమాకు ఫెచ్ ఎక్కువ, తర్వాత వచ్చే సినిమాకు నష్టం ఎక్కువ. ముందు వచ్చిన సినిమా పరాజయం పాలైతే.. రెండో సినిమా టీమ్ చాలా కష్టం. ఇంత కష్టం ఎందుకు.. తీయకపోతే సరికదా అంటారా. ఎవరికి తెలుస్తుంది చెప్పండి ఇద్దరు దర్శక రచయితలు ఒకేలా ఆలోచించి కథ రాసుంటారని. ఎందుకు ‘ఒకే కథ’ కాన్సెప్ట్ గురించి చెబుతున్నారు అనుకుంటున్నారా? ఉందీ.. కారణం ఉంది.
‘సేమ్ కథ’ ఇబ్బందిని ఇటీవల రెండు సినిమాలు ఎదుర్కొన్నాయి. వాటిని మరచిపోక ముందే టాలీవుడ్‌కి మళ్లీ ఈ సమస్య వచ్చింది. ఈసారి కూడా కుర్ర హీరోలే. తొలిసారి సినిమాల విడుదలకు ముందే ఈ విషయం బయటికొస్తే.. ఈసారి ఒక సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈసారి ఇబ్బంది పడుతున్న సినిమాల్లో ‘స్వాతిముత్యం’ ఒకటి కాగా, రెండోది అనుష్క – నవీన్ పొలిశెట్టిల సినిమా.
మహేష్‌బాబు.పి దర్శకత్వంలో అనుష్క్ – నవీన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా టీమ్ చిన్నపాటి ఆందోళనలో ఉందట. కారణం మొన్నీమధ్య వచ్చిన ‘స్వాతిముత్యం’ కథ ఇప్పుడు తాము చేస్తున్న కథ దగ్గరగా ఉండటమే అంటున్నారు. అంటే నవీన్ – అనుష్క సినిమా కూడా సరోగసీ నేపథ్యంలోనే ఉంటుంది అని చెబుతున్నారు. ఈ విషయం తెలిసే ‘స్వాతిముత్యం’ సినిమాను పెద్ద సినిమాల మధ్యలో విడుదల చేసేశారు అని అంటున్నారు.
నాని ‘అంటే సుందరానికీ’, నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాల కథలు కూడా ఇలానే కలసిపోయాయి. ఇంచుమించు ఒకే పాయింట్‌తో సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ రెండు సినిమాలూ పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలు ఆ ఫలితం అందుకోకుండా ఉంటే సరి. ఏదేమైనా ఈ విషయంలో రచయితల సంఘం, దర్శకుల సంఘం ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఇబ్బందే.