సమాజంలో దళితులు, తక్కువ జాతి మనుషులు ఎదుర్కొనే సమస్యలను కథాంశాలుగా సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. అతడి మునుపటి చిత్రాలైన “పెరియెరుమ్ పెరుమాళ్, కర్ణన్” ఈ తరహాలో తెరకెక్కిన చిత్రాలే. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మామన్నన్”. వడివేలు, ఉదయానిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళనాట మంచి విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని “నాయకుడు” పేరుతో తెలుగు ప్రేక్షకులకు అనువాదరూపంలో అందిస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులు ఈ తమిళ పోలిటికల్ డ్రామాకు ఏమేరకు కనెక్ట్ అవ్వగలరు అనేది చూద్దాం..!!
కథ: ఓ చిన్నపాటి కార్యకర్తగా మొదలుపెట్టి.. ఒక్కో మెట్టు కష్టపడి ఎక్కి, ఎమ్మెల్యే అవుతాడు తిమ్మరాజు (వడివేలు). ఎమ్మెల్యే కొడుకు అయినప్పటికీ ఎలాంటి భేషజం లేకుండా పందుల వ్యాపారం చేస్తూ ఇండిపెండెంట్ గా బ్రతుకుతుంటాడు అతడి కుమారుడు రఘువీర (ఉదయానిధి స్టాలిన్). ఈ తండ్రీకొడుకులిద్దరి మధ్య ఏర్పడిన రాజకీయ విబేధాల కారణంగా ఇద్దరి నడుమ మాటలు ఉండవు.
కట్ చేస్తే.. లీల (కీర్తిసురేష్) నడిపే ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కోసం ఒక చోటు వెతుక్కుంటూ.. తన కాలేజ్ మేట్ అయిన వీర వద్దకు వస్తుంది. తాను డోజో నేర్పించే స్థలాన్నే కోచింగ్ సెంటర్ కు వాడుకోవాలని సూచిస్తాడు వీర.
ఆ కోచింగ్ సెంటర్ పై కొందరు రౌడీలు దాడి చేయడంతో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. వీరన్ తనకు తెలియకుండానే ఆ జిల్లా పెద్ద మరియు కులం నాయకుడు అయిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్)తో తలపడతాడు.
వీర-రత్నవేలు నడుమ యుద్ధంలో తిమ్మరాజు ఎలా నలిగిపోయాడు? చివరికి ఎవరు గెలిచారు? ఆ గెలుపు వెనుక జరిగిన విస్ఫోటం ఎటువంటిది? అనేది “నాయకుడు” కథాంశం.
నటీనటుల పనితీరు: ఇప్పటివరకూ మనం ఒక కమెడియన్ లా మాత్రమే చూసిన వడివేలు ఈ చిత్రంలో ఒక సిన్సియర్ పొలిటీషియన్ & బాధ్యతగల తండ్రిగా నటించిన విధానం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. “రంగమార్తాండ” చూశాక బ్రహ్మానందంపై ఎలాంటి గౌరవం పెరిగిందో.. “నాయకుడు” చూశాక వడివేలుపై కూడా అదే స్థాయి గౌరవం పెరుగుతుంది. ఇంత మంచి నటుడ్ని కేవలం కామెడీ జోనర్ బోనులో పడేసిన దర్శకులు తప్పకుండా తలదించుకుంటారు.
ఫహాద్ ఇప్పటివరకూ చాలా నెగిటివ్ రోల్స్ లో నటించాడు కానీ.. ఈ చిత్రంలోని రత్నవేలు పాత్ర అన్నిటికంటే క్రూరమైనది. అగ్ర కులస్తుడిగా అహం, తక్కువ కులం వ్యక్తుల్ని కాలి కింద చెప్పులా చూసే వ్యక్తిత్వం వంటి భావాలు ఫహాద్ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్థాయిలో మరో నటుడెవరూ ఈ పాత్రను ఇంత బ్యాలెన్స్డ్ గా చేసి ఉండేవాడు కాదని చెప్పొచ్చు.
నటుడిగా తన మైనస్ లు అర్ధం చేసుకున్న ఉదయానిధి స్టాలిన్.. అవి ఎలివేట్ అవ్వకుండా తన పాత్రలో ఇమిడిన తీరు బాగుంది. అతడి పాత్రలోని బాధ ప్రేక్షకులకు స్పస్తంగా అర్ధమయ్యేలా దర్శకుడు అతడి పాత్రను డిజైన్ చేయడంతో.. ఉదయనిధికి నటుడిగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు.
కీర్తిసురేష్ పాత్ర సినిమాలో కీలకమైన మలుపు తిప్పేదే అయినప్పటికీ.. ఆ ఒక్క సీక్వెన్స్ తర్వాత మాత్రం ఆమె సైడ్ క్యారెక్టర్ లా మిగిలిపోతుంది. కాకపోతే.. ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ఈ చిత్రంలో నటించడం అనేది ఒకరకంగా ప్లస్ అయ్యింది. నటిగా కీర్తిసురేష్ తనకు లభించిన చిన్నపాటి స్క్రీన్ ప్రెజన్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించింది.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ తెని ఈశ్వర్ పనితనం గురించి ముందుగా మాట్లాడుకోవాలి. 80ల కాలం మరియు ప్రస్తుతం మధ్య తేడాను లైటింగ్ తో చాలా క్లారిటీగా చూపించాడు. అలాగే.. బావిలో పిల్లని రాళ్ళతో కొట్టే సన్నివేశాన్ని, పందుల గుంపును కుక్కలు దాడి చేసే సందర్భాన్ని కంపోజ్ చేసిన తీరు ప్రశంసనీయం. ఒళ్ళు గగుర్పాటు గురి చేసే సన్నివేశాలను.. ఎక్కడా భారీ రక్తపాతం చూపకుండా బ్లాక్ & వైట్ లో చూపించి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.
రెహమాన్ నేపధ్య సంగీతంలో కొత్తదనం వినిపించింది. సాధారణంగా సన్నివేశాన్ని కాస్త ఓవర్ బోర్డ్ చేసే రెహమాన్.. ఈ సినిమాకి మాత్రం సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ తన నేపధ్య సంగీతాన్ని అండర్ ప్లే చేసిన విధానం ఆకట్టుకుంటుంది. పాటలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వవు.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. అందుకు నిర్మాణ సంస్థను కూడా అభినందించాలి. కథకు అవసరం మేరకు ఎక్కడా రాజీపడకుండా దబ్బులు ఖర్చు పెట్టారు. దర్శకుడు మారి సెల్వరాజ్ ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నీ ఒకే జోనర్ లో సాగాయి. అన్నీ సినిమాల్లోనూ దళితులపై జరుగుతున్న ఆకృత్యాలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని కథాంశం తీసుకుని తెరకెక్కించాడు మారి సెల్వరాజ్.
“నాయకుడు” కూడా ఆ తరహా చిత్రమే. అయితే.. ఈ చిత్రంలో “పెరియరూమ్ పెరుమాళ్, కర్ణన్”ల తరహాలో విపరీతమైన హింసకు తావు లేకుండా.. సబ్టల్ గా చూపించడానికి ప్రయత్నించాడు. ఓ మేరకు విజయం సాధించడానే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే “నువ్ అడిగావా మా నాన్నని కూర్చోమని” సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. అలాగే.. తండ్రి పాత్రను బుద్ధుడితో పోల్చుతూ.. అన్నివేళలా హింసతో కాదు.. సంయవనంతో కూడా విజయం సాధించొచ్చని చెప్పిన తీరు ప్రశంసనీయం. అలాగే.. బలహీనుడు కదా అని కొట్టడానికి ప్రయత్నిస్తే, ఎదురుతిరుగుతాడు అని సినిమా మూలకథను హీరో ఇంట్రడక్షన్ సీన్ తోనే వివరించిన విధానం బాగుంది. దర్శకుడిగా మారి సెల్వరాజ్ మూడోసారి కూడా మంచి విజయం సాధించాడనే చెప్పాలి. ఈసారి రాజకీయాన్ని ముఖ్యాంశంగా తీసుకొని.. అక్కడి హెచ్చుతగ్గులను చూపించిన విధానం ప్రస్తుత సమాజానికి అవసరం కూడా.
విశ్లేషణ: దళితులపై దాడులు లేదా తక్కువ కులం వ్యక్తులపై ఆకృత్యాలు కేవలం తమిళనాట మాత్రమే కాదు భారతదేశంలో ప్రతి చోట జరుగుతున్న అంశం. అందువల్ల.. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సినిమాలోని మూలకథకు కనెక్ట్ అవుతారు. కాకపోతే.. కథనం & పాత్రల తీరుతెన్నులు తమిళ నేటివిటీకి బాగా దగ్గరగా ఉండడంతో.. ఆ తెలుగీకరించిన పాత్రలను ఇక్కడి ప్రేక్షకులు ఆస్వాదించలేరు. కాకపోతే.. ఆర్టిస్టిక్ గా చూపించిన కొన్ని సన్నివేశాలకు మాత్రం అందరూ కనెక్ట్ అవుతారు. వడివేలు నట విశ్వరూపం, రెహమాన్ అద్భుతమైన నేపధ్య సంగీతం, మారి సెల్వరాజ్ మార్క్ సన్నివేశాల కోసం “నాయకుడు” చిత్రాన్ని తప్పకుండా చూడొచ్చు.