మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.దివంగత స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా పర్వాలేదు అనిపించే ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో సినిమాని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేశాడు పవన్ కళ్యాణ్. వాస్తవానికి డెబ్యూ మూవీకి కళ్యాణ్ బాబు అలియాస్ కళ్యాణ్ గానే పవన్ కళ్యాణ్ పేరు పడింది.
అయితే 2వ సినిమా కోసం తమిళంలో హిట్ అయిన ‘గోకులతిల్ సీతై’ రీమేక్ ను ఎంపిక చేసుకున్నారు. అక్కడ హీరోగా నటించాడు. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఓ చిన్న పాత్ర చేశాడు. కాలేజ్ లో ఉండే స్టూడెంట్స్ లో అతను కూడా ఒకడు. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగుకి వచ్చేసరికి కొన్ని మార్పులు చేశారు దర్శకులు ముత్యాల సుబ్బయ్య. పోసాని కృష్ణమురళీ ఈ చిత్రానికి ఒక రైటర్ గా పనిచేశారు. ఆయనకి డైలాగ్ రైటర్ గా క్రెడిట్ ఇచ్చారు.
అయితే హీరో క్యారెక్టరైజేషన్లో భాగంగా అతని పేరుని పవన్ కళ్యాణ్ అని పెట్టారు పోసాని. 1997 ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత కలెక్షన్స్ పెరుగుతూనే వచ్చాయి. ఫైనల్ గా ఈ సినిమా సూపర్ హిట్ ఫలితాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ బాబుగా ఉన్న పేరు పవన్ కళ్యాణ్ గా మారింది. ఆ క్రెడిట్ కూడా పోసాని కృష్ణమురళీకే దక్కుతుంది అని చెప్పాలి. ‘గోకులంలో సీత’ రిలీజ్ అయ్యి ఈ ఆగస్టు 22కి 28 ఏళ్ళు పూర్తికావస్తోంది.