Nene Vasthunna Review: నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 29, 2022 / 01:29 PM IST

ధనుష్-సెల్వ రాఘవన్ ల టెర్రిఫిక్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కిన చిత్రం “నేనే వస్తున్నా”. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. విడుదలైన ట్రైలర్ కానీ పాటలు కానీ సినిమా ఎలాంటి జోనర్ అనేది ఎలివేట్ చేయలేదు, చిత్రబృందం కూడా ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. మరి అది ఎంతవరకూ వర్కవుటయ్యింది అనేది చూద్దాం..!!

కథ: కవలలు కధిర్ & ప్రభు (ధనుష్) చిన్నప్పుడే దూరమవుతారు. ప్రభు కుటుంబంతో కలిసి సరదా జీవితం సాగిస్తుండగా.. కధిర్ సైకలాజికల్ ఇష్యూస్ కారణంగా వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ ఇద్దరూ ఊహించని విధంగా మళ్ళీ కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు ముఖ్య కారణం ప్రభు కూతురు సత్య. అసలు ప్రభు కుమార్తె సత్య, కధిర్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యింది? ఆ కారణంగా ప్రభు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేది “నేనే వస్తున్నా” కథాంశం.

నటీనటుల పనితీరు: ఈమధ్యకాలంలో ధనుష్ ఫలానా పాత్రలో ఒదిగిపోయాడు, అద్భుతంగా నటించాడు అనే పదాలు అతడి ప్రతి సినిమా విషయంలో వింటున్నాం. అందుకు “నేనే వస్తున్నా” ఏమీ మినహాయింపు కాదు.. ఈ చిత్రంలో బాధ్యతగల తండ్రిగా, సైకోగా రెండు విభిన్న పాత్రలో అదరగొట్టాడు ధనుష్. ముఖ్యంగా సైకో పాత్రలో ధనుష్ నటన, అతడి క్యారెక్టరైజేషన్ ను బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎలివేట్ చేసిన విధానం చాలా బాగున్నాయి.

సెల్వరాఘవన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఎఫెక్టివ్ గా ఉంది. ఎల్లీ అవరామ్, ఇందుజాలు సినిమాకి వేల్యూ యాడ్ చేశారు. వీళ్ళందరికంటే కూతురు సత్యగా నటించిన చిన్నారి అదరగొట్టింది. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టింది కూడా.

సాంకేతికవర్గం పనితీరు: ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ను తన నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేయడమే కాక, ప్రేక్షకుల్ని భయపెట్టిన ఘనత యువన్ కు దక్కుతుంది. చాలా చిన్నపాటి ఎమోషన్స్ & నటీనటుల ఎక్స్ ప్రెషన్స్ ను కూడా అద్భుతంగా ఎలివేట్ చేశాడు యువన్. అందుకు ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ కూడా బాగా హెల్ప్ అయ్యింది. కథను మలుపు తిప్పే ఎలివేషన్స్ ను కూడా హడావడి లేకుండా కెమెరా యాంగిల్స్ & లైటింగ్ తో ఎలివేట్ చేసిన విధానం ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి.

క్యారెక్టరైజేషన్స్ తో కథను నడపగలిగే అతి తక్కువమంది ఫిలిమ్ మేకర్స్ లో సెల్వరాఘవన్ ప్రముఖుడు. “నేనే వస్తున్నా”లో కూడా అదే పంధాను ఫాలో అయ్యాడు. ఒక హారర్ థ్రిల్లర్ కు సైకో డ్రామాను యాడ్ చేసి ఆడియన్స్ ను అబ్బురపరచాలనుకున్నాడు. ఫస్టాఫ్ వరకు విజయం సాధించాడు కూడా. మరి సెకండాఫ్ కథ రాసుకోవడానికి టైమ్ దొరకలేదా లేక ధనుష్ డేట్స్ దొరకలేదా అనే విషయం తెలియదు కానీ.. సెకండాఫ్ మాత్రం చుట్టేశాడు.

అందువల్ల ఫస్టాఫ్ వల్ల క్రియేట్ అయిన ఇంపాక్ట్ సెకండాఫ్ పోగొట్టేసింది. ఇక క్లైమాక్స్ ఏమిటి అనేది ప్రేక్షకులు ముందే గెస్ చేయగలగడం, అది కూడా ఈ తరహా థ్రిల్లర్ కు పెద్ద మైనస్ పాయింట్. సెకండాఫ్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ చిత్రం సెల్వ రాఘవన్ కెరీర్లో మరో మైల్ స్టోన్ గా నిలిచేది.

విశ్లేషణ: కథనంతో సంబంధం లేకుండా ధనుష్ నటన, బేబీ సత్య క్యారెక్టరైజేషన్, యువన్ సంగీతం ఆస్వాదించగలిగేవారు మాత్రమే థియేటర్లలో చూడదగిన చిత్రం “నేనే వస్తున్నా”. సెల్వ రాఘవన్ సెకండాఫ్ విషయంలో కనీస స్థాయి జాగ్రత్త తీసుకున్నా సినిమా సూపర్ హిట్ అయ్యేది. కానీ.. ఇప్పుడు బిలో యావరేజ్ గా మిగిలిపోయింది.

రేటింగ్: 2/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus