నెట్‌ఫ్లిక్స్ (Netflix) గతంలో ఇండియాలో హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లతో మొదలైనా, ఇప్పుడు సౌత్ ఇండియన్ మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్‌లో భారీ స్టూడియో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు హిందీ, సౌత్ సినిమాలను నిర్మాతల నుంచి తీసుకుని స్ట్రీమ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు తెలుగులో సొంత ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మాణంపై దృష్టి సారించనుంది.
ఈ క్రమంలో హైదరాబాద్‌లో స్టూడియో స్థాపన తెలుగు ఆడియన్స్‌కు మరింత చేరువ కానుంది. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ స్కాన్‌లైన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని ఇమేజ్ టవర్స్‌లో అత్యాధునిక స్టూడియోను నిర్మించేందుకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) సన్నాహాలు చేస్తోంది. ఈ స్టూడియో ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కంటెంట్‌ను సొంతంగా నిర్మించడంతో పాటు, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ వర్క్‌ను కూడా చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
సినిమా నిర్మాణానికి హైదరాబాద్ ఒక కేంద్రంగా ఉండటం, ఇక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఈ నిర్ణయానికి కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో వీఎఫ్‌ఎక్స్ ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. నెట్‌ఫ్లిక్స్ ఈ స్టూడియో ద్వారా అత్యాధునిక సాంకేతికతతో తెలుగు కంటెంట్‌ను రూపొందించి, సౌత్ ఆడియన్స్‌ను ఆకర్షించేలా ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అందిస్తున్న సపోర్ట్ ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఊతం ఇస్తోంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుంచి తెలుగు ఒరిజినల్ సినిమాలు, సిరీస్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని, ప్రముఖ తెలుగు హీరోలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ఈ స్టూడియో 2025 చివరి నాటికి పనులు పూర్తి చేసి, 2026 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ కొత్త అడుగుతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతుంది. ఇప్పటివరకు RRR (RRR) లాంటి సినిమాలను వరల్డ్ లో హైలెట్ అయ్యేలా స్ట్రీమ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు తెలుగులో సొంత కంటెంట్‌ను నిర్మించడం ద్వారా స్థానిక కథలను గ్లోబల్ స్థాయిలో పరిచయం చేయనుంది. ఈ స్టూడియో ద్వారా హైదరాబాద్ సినీ ఇండస్ట్రీకి మరింత పేరు వచ్చే అవకాశం ఉంది. తెలుగు ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.