తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని సినిమా అభిమానులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వాళ్ల కోరిక “రెట్రో”తో (Retro) నెరవేరింది. ప్రమోషనల్ కంటెంట్ & పోస్టర్స్ అన్నీ మంచి హైప్ ఇచ్చాయి. ఇక పూజా హెగ్డే డ్యాన్స్ పుణ్యమా అని బీభత్సమైన క్రేజ్ క్రియేట్ అయ్యింది. మరి సూర్య ఎట్టకేలకు హిట్ కొట్టగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: “నరకాసుర వధ” కాన్సెప్ట్ కు మాఫియాను మాధ్యమంగా తెరకెక్కించిన చిత్రం “రెట్రో”. పారి (సూర్య) తనకు పుట్టకపోయినా, తనకు కాపలా ఉంటాడని పెంచుకుంటాడు తిలక్ (జోజు జార్జ్). అయితే.. ప్రేమించిన అమ్మాయి రుక్మిణి (పూజ హెగ్డే) కోసం అన్నీ వదిలేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటాడు పారి.
కానీ.. “బంగారు చేప” కారణంగా పారి-తిలక్ మధ్య రిలేషన్ దెబ్బ తింటుంది. దాంతో పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. అనంతరం పారి జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది? పారి-రుక్మిణిల ప్రేమ కథ ఏ తీరానికి చేరుకుంది? అనేది “రెట్రో”(Retro) కథాంశం.
నటీనటుల పనితీరు: సూర్యను ఇప్పటివరకు చూసిన విధానం వేరు, ఈ సినిమాలో చూసే విధానం వేరు. ప్రజంటేషన్ విషయంలో చాలా కొత్తగా కనిపించాడు. ముఖ్యంగా లక్స్ & బాడీ లాంగ్వేజ్ విషయంలో నవ్యత చూపించాడు. ఇక కాస్ట్యూమ్స్ లో రెట్రో లుక్ లో సూర్య స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అలాగే.. భిన్నమైన వేరియేషన్స్ ను తనదైన శైలిలో పండించాడు.
పూజ హెగ్డే నటించలేదు అనే కామెంట్ కు సమాధానం ఈ సినిమాతో ఇచ్చింది. ఎమోషనల్ సీన్స్ లో తన సత్తా చాటుకుంది. లుక్స్ విషయంలో ఆమెను మరీ డీగ్లామర్ గా చూపించారు.
మలయాళ నటుడు జోజు జార్జ్ మాత్రం తన పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేశాడు. నెగిటివ్ రోల్ తో హాస్యం పండించడం అనేది అంత ఈజీ కాదు. కానీ.. కామెడీ & విలనిజం ఒకేసారి పండించాడు.
విధు ప్రతాప్ కల్ట్ రోల్ ప్లే చేశాడు. ఆ క్యారెక్టర్ కి సరైన ఆర్క్ కానీ, క్లారిటీ కానీ లేదు. ప్రకాష్ రాజ్, శ్వాసిక, కరుణాకరన్, జయరాం లు సహాయ పాత్రలో అలరించే ప్రయత్నం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ సుబ్బరాజు సినిమా అంటే కనీస స్థాయి అంచనాలు ఉంటాయి. సినిమాగా నచ్చకపోయినా కొన్ని పాత్రలు లేదా సన్నివేశాలు లేదా క్యారెక్టర్ ఆర్క్స్ లేదా ఫ్రేమ్స్ ఎంజాయ్ చేస్తాం. మొట్టమొదటిసారి ప్రతి విషయంలోనూ ఫెయిల్ అయ్యాడు. కథలో నావెల్టి ఉన్నప్పటికీ.. కథనం, పాత్రల్లో ఎక్కడా నవ్యత లేదు. ముఖ్యంగా నరకాసుర వధ అనే కాన్సెప్ట్ ను ఇంత వింతగా డీల్ చేసిన ఏకైక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాన్సెప్ట్ లో మాఫియా, లవ్ స్టోరీ, రివెంజ్ డ్రామా వంటి జానర్స్ అన్నీ ఇరికించాడు. “ప్రేమ, నవ్వు, యుద్ధం, కల్ట్, ధర్మం, ఆ ఒక్కడు” అని ఖండాలుగా సినిమాని విభజించినప్పటికీ… అందులో ఎక్కడా క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకులు సహనానికి పరీక్ష పెట్టినట్లయింది. అయితే.. కృష్ణతత్వం, కల్ట్ కల్చర్, బానిసత్వం, రాజ్యాధికారం వంటి కాన్సెప్ట్స్ ను డీల్ చేసిన విధానంలో మాత్రం కార్తీక్ సుబ్బరాజు మార్క్ కనిపిస్తుంది.
శ్రేయాస్ కృష్ణ ఈ సినిమాకి సెకండ్ హీరో. అతని ఫ్రేమింగ్స్, కలర్ టోన్ సినిమాకి కొత్త డైమెన్షన్ ఇచ్చాయి. సంతోష్ నారాయణన్ “కనిమా, ది ఒన్” మినహా మరే ఇతర పాటతో అలరించలేకపోయాడు. అయితే.. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం అస్సలు డిజప్పాయింట్ చేయలేదు.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కష్టాన్ని మాత్రం మెచ్చుకోవాలి. బాజూకాల దగ్గర నుంచి కల్ట్ స్టేడియం సెట్ గట్రా అన్ని చాలా సహజంగా ఉన్నాయి. అలాగే కాస్ట్యూమ్స్ టీమ్ కూడా చాలా కష్టపడ్డాడు. 1993 నుండి 1998 కాలాన్ని డీసెంట్ గా డెపిక్ట్ చేసారు.
విశ్లేషణ: కొన్ని సినిమాలు ఆలోచనగా బాగుంటాయి, పుస్తకంగా చదివితే ఎగ్జైట్ చేస్తాయి. కానీ.. అవి సినిమాగా రూపాంతరం చెందాక మల్టిపుల్ జోనర్స్ ను ఇరికించిన కారణంగా ఆకట్టుకోలేక ఒకింత కన్ఫ్యూజ్ చేస్తాయి. “రెట్రో” అలాంటి సినిమానే. కార్తీక్ సుబ్బరాజు చాలా ఎక్కువ విషయాలను ఒక సినిమాలో చెప్పాలనుకున్నాడు. అన్నిటికీ మించి ప్రేమకథను ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని నడపడం మెయిన్ మైనస్ అయ్యింది. తన సినిమాలు వైవిధ్యంగా ఉండాలే కానీ.. రెగ్యులర్ గా ఉండకూడదు అనే కార్తీక్ సుబ్బరాజు తాపత్రయం ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టింది. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ ఫ్యాన్ అయితే తప్ప “రెట్రో” చిత్రాన్ని ఆస్వాదించడం కష్టం. అయితే.. కెమెరా వర్క్ & ఆర్ట్ వర్క్ టీమ్ కష్టాన్ని మాత్రం మెచ్చుకోవాలి.
ఫోకస్ పాయింట్: వింతకి, వైవిధ్యానికి మధ్య నలిగిపోయిన రెట్రో!
రేటింగ్: 2/5