సినిమాకు సంబంధించి చాలా విషయాలు చెబుతాం.. చాలా లీకులు ఇస్తాం. కానీ సినిమాలో హీరోయిన్ల వివరాలు మాత్రం చెప్పం – గత కొన్ని నెలలుగా ‘రాకా’ సినిమా టీమ్ చేస్తున్న పని ఇది. అందుకే సినిమాకు సంబంధించి పుకార్లలో ఎక్కువ శాతం హీరోయిన్ల గురించే. వాళ్లు నటిస్తున్నారు, వీళ్లు నటిస్తున్నారు అంటూ రూమర్లు రావడం తప్ప.. దీపికా పడుకొణె విషయం తప్ప ఇంకేదీ టీమ్ నుండి అధికారికంగా బయటకు రాలేదు. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అది కూడా హీరోయిన్ గురించే.
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాకా’. సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకొణె ప్రధాన కథానాయిక. ఆమె కాకుండా మరో నలుగురు హీరోయిన్లు ఉంటారని.. అందులో ఒకరు ప్రతినాయిక ఛాయలున్న పాత్రను పోషిస్తారని వార్తలొస్తున్నాయి. ఆ పాత్రను రష్మిక మందన చేస్తున్నారని ఆ వార్తల సారాంశం. అయితే ఇప్పుడు ఈ ప్రతినాయిక పాత్ర చేస్తోంది అంటూ మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఆమెనే ఐశ్వర్య లక్ష్మి. త్వరలో ఆమె షూటింగ్‌లో పాల్గొంటుంది అని చెబుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ముంబయిలోనే జరుగుతుంది. ఇప్పుడు ఐశ్వర్య లక్ష్మి పాల్గొనబోయే షెడ్యూల్ కూడా అక్కడే ఉంటుంది. ఇక హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. మృణాల్ ఈ సినిమాలో ‘రాకా’కు స్నేహితురాలిగా ఉంటుందని టాక్. ఇక జాన్వీ.. ఈ సినిమాలో ఓ అడవి సామ్రాజ్యానికి యువరాణిగా కనిపిస్తుందట. ఐశ్వర్య లక్ష్మి విలన్ అంటున్నారు కాబట్టి.. ఆ పాత్రలో నటించాల్సిన రష్మిక సినిమా నుండి తప్పుకున్నట్లే అని చెప్పొచ్చు.
ఈ అన్ని విషయాలను చిత్రబృందం సినిమా విడుదలకు కాస్త ముందు ఒక్కొక్కటిగా అధికారికంగా చెబుతారట. ఇప్పటివరకు అయితే సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం చెప్పలేదు. మామూలుగా డేట్ చెప్పేసి వరుస వాయిదాలు వేసే దర్శకులున్న మన దగ్గర ఇలా డేట్ చెప్పకుండా సినిమా షూట్ చేస్తున్నారు అంటే.. ఏదో ప్లానింగే ఉండాలి.