సినిమా హీరోలకు బిరుదులు లేదా ట్యాగ్‌లు రావడం సహజం. కొంతమందికి అభిమానులు పెడితే.. ఇంకొంతమందికి మీడియా ఇస్తుంటుంది. మరికొందరు అయితే తమకు తామే ఇచ్చుకుంటారు. అయితే ఈ పని కొంతమంది నేరుగా చేస్తే, ఇంకొంతమంది తమ సినిమా పేరుతో రిలీజ్ చేసి చూపిస్తారు. ఇందులో మొదటి రకాల హీరోల గురించి మీకు తెలుసు, ఒకవేళ లేదంటే ఆఖరులో చూద్దాం. ఇప్పుడు అయితే ఆఖరి రకం ట్యాగ్‌లైన్ గురించి చూద్దాం. ‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వెల్‌గా ‘టిట్లు స్క్వేర్’ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా టైటిల్‌ను ఓ టీజర్‌తో వెల్లడించింది చిత్రబృందం. ‘డీజే టిల్లు 2’గా ఉంటుందేమో సినిమా పేరు అని అనుకుంటుండగా.. కాదు ఇది ‘టిల్లు’ని రెండింతలు చేసే చూపించే సినిమా అందుకే ‘టిట్లు స్క్వేర్’ అని పేరు పెట్టాం అంటూ చిత్రబృందం చెప్పకనే చెప్పింది. ఆ విషయం పక్కనపెడితే.. ఆ సినిమా టైటిల్‌తోపాటు మరో విషయం కూడా కనిపించింది. అదే హీరో సిద్ధు జొన్నలగడ్డ ట్యాగ్‌లైన్. టీజర్ వీడియోలో టైటిల్ మీద ‘స్టార్ బోయ్’ అని కనిపించింది.
అదే సిద్ధు జొన్నలగడ్డ బిరుదు/ ట్యాగ్‌లైన్ అనుకోవచ్చు. అంటే సిద్ధు తనకు తాను స్టార్ అని ట్యాగ్ పెట్టుకున్నట్లే. ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్ అనే ట్యాగ్ వాళ్ల బిరుదులో వెనక్కి ఉంటుంది. అంటే మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, రెబల్ స్టార్, నేచురల్ స్టార్, .. ఇలా అన్నమాట. ఇప్పుడు సిద్ధు స్టార్ బోయ్ అయ్యాడు. ఇకపై కుర్ర హీరోలు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతారని టాక్ వినిపిస్తోంది. ఇక సిద్ధు.. తన పేరుకు ముందు పెట్టుకున్న ట్యాగ్‌లో బోయ్ రావడానికి కారణం.
అతని సోషల్ మీడియా హ్యాండిల్ నేమ్స్ కూడా. సిద్ధు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘సిద్ధు బోయ్’ అని ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక ముందు చెప్పినట్లు తనకు తాను ట్యాగ్‌లైన్ పెట్టుకున్న వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. బిజినెస్ బ్రాండ్ రౌడీని.. పనిలో పనిగా ప్రమోట్ చేసుకుంటూ రౌడీ హీరో అని పెట్టుకున్నాడు. అతని పీఆర్ టీమ్ ఆ పేరును బాగా జనాల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు సిద్ధు కూడా ఇంచుమించు ఇలాంటి పనే చేశాడు.