తెలుగులో సినిమా అవకాశాలు వచ్చేంతవరకు ‘తెలుగులో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని చెబుతుంటారు. వన్స్ తెలుగులో ఛాన్స్‌లు వచ్చి, ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే ఇతర పరిశ్రమలవైపు చూస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఎక్కడ ఛాన్స్‌లు వస్తుంటే అక్కడికి వెళ్లడం కరెక్టే. అయితే ఇక్కడ ఛాన్స్‌లు తగ్గాక వేరే దగ్గరకు వెళ్లి అక్కడే బాగుంది అనడం సరికాదు. ఇలాంటి మాటలు గతంలో చాలామంది నార్త్ హీరోయిన్లు చేశారు.
ఇప్పుడు అదే ఉద్దేశంలో అనిందో లేక తన ఉద్దేశం వేరే ఉందో కానీ.. నిధి అగర్వాల్ కూడా ఇలానే మాట్లాడింది. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో అవకాశాల కోసం తొందరపడడం లేదని చెప్పింది నిధి అగర్వాల్. అందులో తప్పేముంది అనుకుంటున్నారా? మంచి దర్శకులతో అర్థవంతమైన పాత్రలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. అంతేకాదు అలాంటి పాత్రలకు తమిళ ఇండస్ట్రీ సరైన చోటు అని చెప్పింది.
అంటే తెలుగులో ఆమె సరైన పాత్రలు ఇవ్వడం లేదు అన్నట్లేగా అనే ప్రశ్న వస్తోంది. నిజానికి నిధి అగర్వాల్ తమిళ సినిమా పరిశ్రమకు వెళ్లడం కొత్తేమీ కాదు. తెలుగులో వరుస సినిమాలు చేసే సమయంలో కథల ఎంపిక విషయంలో, పాత్రల ఎంపిక విషయంలో తప్పులు చేసి తెలుగు నుండి ఐదేళ్ల క్రితమే తమిళంలోకి వెళ్లింది. అక్కడ తమిళంలో నిధి చేసిన సినిమాలు ‘ఈశ్వరన్’, ‘భూమి’, ‘కళగ తలైవన్’. అక్కడ కూడా పాత్రల ఎంపిక విషయంలో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది.
ఇప్పుడు మూడు సినిమాల తర్వాత తమిళ సినిమా చేయలేదని, సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇదే సమయంంలో తెలుగులో నిధికి గత రెండు సినిమాలు అగ్రహీరోలవే వచ్చాయి. అవే ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’. అయితే ఆ రెండు సినిమాలు హిట్ కాలేదు. దీంతో ఇప్పుడు నిధి చేతిలో సినిమాలు లేవు. ఆ పరిస్థితి వల్ల తమిళ సినిమాను ఇప్పుడు పొగిడేసిందేమో తెలియాలి.