ఆసక్తికరంగా ఉన్న నీహారిక కొత్త సినిమా టైటిల్

  • November 6, 2018 / 09:19 PM IST

దాదాపు డజను హీరోలున్న మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక కథానాయిక నిహారిక. మొదట హోస్ట్ గా పరిచయమై, అనంతరం “ముద్దపప్పు ఆవకాయ్” అనే వెబ్ సిరీస్ తో అందరికీ చేరువైన నిహారిక తెలుగు కథానాయికగా నటించిన చిత్రం “ఒక మనసు”. నాగశౌర్య కథానాయకుడిగా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం కొందరు విమర్శకుల ప్రశంసలు అందుకోగలిగిందే కానీ కమర్షియల్ హిట్ మాత్రం సాధించలేకపోయింది. అయితే నటిగా మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత విజయ్ సేతుపతితో కలిసి ఒక తమిళ సినిమా చేసింది.

ఆదేమో డిజాస్టర్ అయ్యింది.. ఇక రీసెంట్ గా వచ్చిన “హ్యాపీ వెడ్డింగ్” అయితే రిలీజ్ అయినంత ఫాస్ట్ గా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది కూడా. దీంతో సైలెంట్‌గా మరో చిత్రాన్ని పూర్తిచేస్తోందామె. ఇందులో ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ముద్దపప్పు ఆవకాయ్ వంటి వెబ్ సిరీస్‌ని రూపొందించిన ప్రణీత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి “సూరేకాంతం” అనే టైటిల్‌ని చిత్ర వర్గాలు ఖరారు చేసినట్లు సమాచారం. సినిమాలో నిహారిక పాత్ర పేరు సూరేకాంతం అని, అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసింది. కాగా త్వరలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ని విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus