సినిమా తీయడం వరకే దర్శకుల చేతుల్లో ఉంది.. ఆ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం వారి చేతుల్లో ఉండదా? ఏమో ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. సినిమా స్థాయిని పెంచడం, క్వాలిటీ పెంచడం, ఆసక్తికర అంశాల పెంచడం లాంటి వాటి వల్ల సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు. దీంతో సినిమా అంతా సిద్ధమైనా.. వీఎఫ్‌ఎక్స్ పనులు అవ్వక సినిమాలు లేట్ అవుతున్నాయి. ఈ మాట ఇండస్ట్రీలో చాలామంది ఒప్పుకోరు.. కానీ ఇదే నిజం అంటున్నారు.
ఇప్పుడు ఇదే నిజం కారణంగా చూపించి.. ‘వారణాసి’ సినిమాను ఆలస్యం చేయబోతున్నారా? అంటే అవును అనే చర్చే నడుస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ లేనట్లు అనుకున్న టైమ్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు రాజమౌళి. ఆయన సినిమా షూటింగ్ దశలోనే లేట్ అవుతుంది అనే మాట నిజం కాదు అని చెబుతూ గుమ్మడి కాయ కొట్టేశారు. కానీ సినిమా అనుకున్న టైమ్‌కి రాదు అని అంటున్నారు. దానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆలస్యం జరుగుతోంది అని చెప్పడమే.
రాజమౌళి విజన్‌కి తగ్గట్టుగా.. కార్తికేయ ప్లానింగ్‌కి తగ్గట్టుగా వీఎఫ్‌ఎక్స్ షాట్లు సిద్ధం చేసి.. ఇవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పేశారట. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారం ఇంకా స్టార్ట్ చేయలేదు అని అంటున్నారు. ఈ సినిమా కోసం దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు చేయాలని రాజమౌళి అండ్ కో. ప్లాన్ చేశారు. వీటన్నింటికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. అంటే ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేయాలి.
వీఎఫ్‌ఎక్స్ సిద్ధం కాకుండా సినిమా ప్రచారం మొదలుపెడితే.. విడుదల వాయిదా వేసి మరోసారి ప్రచారం చేయడం బాగా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే సినిమా పూర్తిగా సిద్ధం అనుకున్నాకే ప్రచారం షురూ చేయాలని అనుకుంటున్నారట. ఈ లెక్కన ఈ సినిమా విడుదల వాయిదా పడితే వీఎఫ్‌ఎక్స్ టీమ్ మీదకు నెపం నెట్టేస్తారు.