“నేను మెగా కుటుంబం నుంచి రావడం వల్ల నా మొదటి సినిమా విడుదలకు ముందు నుంచే నా మీద నా టాలెంట్ కు మించిన అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలతోపాటు పరిమితులు కూడా ఏర్పడ్డాయి. గ్లామర్ రోల్స్ చేయకూడదు, ఆన్ స్క్రీన్ రొమాన్స్ సీన్స్ ఉండకూడదు. ఇలా చాలా లిమిటేషన్స్ నా మీద ఉన్నాయి. అందుకే నేను మొదటి నుంచి ఒక హీరోయిన్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.. ఎప్పటికైనా నీహారిక మంచి నటి, ఎలాంటి పాత్రనైనా చేయగలదు అనిపించుకోవడమే నా ధ్యేయం.
నాలోని ఒక సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే చిత్రమే “సూర్యకాంతం”, అందుకే ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ తో ఉన్నాయి” అంటూ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది నీహారిక కొణిదెల. నాగబాబు కుమార్తెగా, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నీహారిక.. “ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్” చిత్రాలతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నప్పటికీ.. కమర్షియల్ హిట్ మాత్రం టేస్ట్ చేయలేకపోయింది. అయితే.. ఆ లోటును “సూర్యకాంతం” భర్తీ చేస్తుందనే నమ్మకం తనకుందని చెబుతోంది నీహారిక. ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కిన “సూర్యకాంతం” రేపు (మార్చి 29) విడుదలవుతున్న సందర్భంగా ఫిల్మీ ఫోకస్ కి ఆమె ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..!!
ప్రతి అమ్మాయిలో ఆ చిన్నపాటి శాడిజం ఉంటుంది..
“సూర్యకాంతం” ట్రైలర్ లో నా పాత్ర వ్యవహారశైలిలో కాస్త శాడిజం కనిపించిన మాట వాస్తవమే కానీ.. నా పాత్ర శాడిస్ట్ ది అయితే కాదు. అయినా ప్రతి అమ్మాయిలో ఆ చిన్నపాటి శాడిజం ఉంటుంది. ఈ పాత్ర రాసినప్పుడు డైరెక్టర్ ప్రణీత్ నన్ను ఊహించుకోకపోయినా.. డెవలప్ చేసేప్పుడు మాత్రం నన్నే చూసుకున్నాడు. చాలా సన్నివేశాలు నా రియలిస్టిక్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుంది. సూర్యకాంతం అనే అమ్మాయి చాలా ఇండిపెండెంట్.. “20 ఏళ్ళకి ఇంట్లో చెప్పినట్లుగా పెళ్లి చేసేసుకుంటే.. ఇంక నాకంటూ లైఫ్ ఎక్కడుంటుంది.. జీవితాన్ని ఎప్పుడు ఎక్స్ ఫ్లోర్ చేస్తాను” అని వాదించే పాత్ర సూర్యకాంతంది. నిజజీవితంలో నేను అలానే ఉంటాను. అందుకే ఈ పాత్ర, సినిమా నాకు చాలా ఇష్టం. నా కెరీర్ లో మొదటిసారిగా నాన్న, అన్నయ్యల మీద డిపెండ్ అవ్వకుండా నేను సొంతంగా డిసైడ్ అయిన సినిమా ఇది.
నాకు ఇష్టం లేకపోయినా చేసిన పని అది..
నాకైతే డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చేయాలి అని ఉండేది. కానీ.. నాన్నగారు “ముందు కొన్నాళ్లపాటు టీవీలో వర్క్ చెయ్, అప్పుడు నీకు కెమెరా అలవాటవుతుంది. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లొచ్చు” అని సలహా ఇచ్చారు. అందుకే ఒక డ్యాన్స్ షో & ఒక టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించాను. ఈ షోస్ పుణ్యమా అని స్పాంటానిటీ బాగా పెరిగింది. ఒక రెండేళ్ల తర్వాత నాకే నచ్చలేదు. వెంటనే నాన్నకి చెప్పి.. సినిమాల్లోకి వచ్చేశాను.
ఒక మనసు బ్యాడ్ ఫిలిమ్ అంటే నేను ఒప్పుకోను..
కమర్షియల్ గా “ఒక మనసు” అనే సినిమా ఫెయిల్ అయ్యింది అని ఎవరైనా అంటే ఒకే కానీ.. అది బ్యాడ్ ఫిలిమ్ అంటే మాత్రం నేణు ఒప్పుకోను. నా లైఫ్ లో నేను విన్న గొప్ప లవ్ స్టోరీ “ఒక మనసు” చిత్రంలోని సూర్య-సంధ్యలది. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. “నువ్ పదేళ్ళు జైల్ కి వెళ్ళినా పర్లేదు.. నేను వెయిట్ చేస్తాను” అంటుంది హీరోయిన్. నిజజీవితంలో అలా ఎవరుంటారు చెప్పండి.. ఈ జనరేషన్ లో ఇలాంటి లవ్ స్టోరీ రావడమే గొప్ప. అందుకే ఆ సినిమా చేశాను. “హ్యాపీ వెడ్డింగ్” అనే సినిమా కూడా కథగా బాగుంటుంది. ప్రతి నవతరం అమ్మాయి జీవితంలో జరిగే కథ ఇది. కానీ.. ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిల్ అయ్యింది. సో, నేను బ్యాడ్ ఫిలిమ్ ఎప్పుడూ చేయలేదు..
నన్ను వాళ్ళందరూ తమ ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు..
ఒక హీరోయిన్ గా నేను ఎంట్రీ ఇద్దామనుకున్నప్పుడు.. నాన్న, చిరంజీవి పెదనాన్న, కళ్యాణ్ బాబాయ్, చరణ్, వరుణ్, అర్జున్ ఇలా వీళ్ళందరినీ ఒప్పించడం కంటే ఫ్యాన్స్ ను కన్విన్స్ చేయడం పెద్ద సమస్యగా మారింది. వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా భావిస్తారు. సడన్ గా నేను హీరోయిన్ అవుతాను అనేసరికి నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా వాళ్ళే భయపడ్డారు. కానీ.. అసలు నేను సినిమాల్లోకి ఎందుకు వెళ్తున్నాను అని క్లారిటీగా వివరించాక ఒప్పుకున్నారు. బాలీవుడ్ లో హీరోల కూతుర్లు కూడా సినిమాలు చేస్తున్నారు, గ్లామరస్ రోల్స్ చేస్తున్నారు మీరు ఎందుకు చేయడం లేదు అని అడుగుతుంటారు. బాలీవుడ్ లో హీరోల కూతుళ్లని కూడా ఒక నటిలా మాత్రమే చూస్తారు. కానీ.. టాలీవుడ్ లో ఒక కుటుంబ సభ్యురాలిలా చూస్తారు. అందుకే నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి.
అలా పిలిస్తే సిగ్గేస్తుంటుంది..
నన్ను మెగా ఫ్యాన్స్ అందరూ సరదాగా “మెగా ప్రిన్సెస్” అని పిలుచుకుంటారు. అలా వాళ్ళు ప్రేమగా పిలవడం అనేది నాకు ఇష్టమే కానీ.. పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా అలా పిలుస్తుంటే మాత్రం సిగ్గేస్తుంది. అలాగని ఇబ్బందేమీ లేదు కానీ.. నీహారిక అని పిలిస్తేనే హ్యాపీగా ఉంటుంది.
నేనేమీ నా నడుము చూపించుకోవడానికి సినిమాల్లోకి రాలేదు..
ఒక నటిగా భిన్నమైన చిత్రాలు చేయడానికి మాత్రమే నేను సినిమాల్లోకి వచ్చాను. అంతే తప్ప నేనేదో అందంగా ఉంటాను, నాకు సన్నని నడుము ఉంది అని చూపించుకోవడానికి సినిమాల్లోకి రాలేదు. అందువల్ల సినిమాలో నా పాత్ర హైలైట్ అవ్వాలీ, లేదా నా నటన హైలైట్ అవ్వాలి కానీ.. నా అందం కాదు. సో, జనాలు నన్ను ఒక నటిగా గుర్తిస్తే చాలు.
కళ్యాణ్ బాబాయ్ లాంటి నిజాయితీగల పొలిటీషియన్ ను ఇప్పటివరకూ చూడలేదు..
కళ్యాణ్ బాబాయ్ కి రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పట్నుంచి ఉందో నాకు తెలియదు కానీ.. ఆయన రాజకీయ ప్రస్థానం చూసి నేను షాకయ్యాను. ఆయనకి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పట్నుంచి ఉందో కూడా నాకు తెలియదు. సడన్ గా పోలిటికల్ ఎంట్రీ ఇచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఆయన విధివిధానాలు నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఆయన రమ్మనాలే కానీ.. పరిగెట్టుకుంటూ వెళ్ళి జనసేనకి ప్రచారం చేస్తాను. కానీ.. ఆయనకి నా అవసరం లేదనే అనుకుంటున్నాను.
మా నాన్న ఆ ఒక్క విషయంలో మారకుండా ఉంటే చాలు..
మా నాన్న యాక్టర్, ప్రొడ్యూసర్ అని నిన్నటివరకూ అందరికీ చెబుతూ వచ్చాను. అలాంటిది సడన్ గా ఇప్పుడు మా నాన్న పొలిటీషియన్ అని చెప్పాలంటే నాకే చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు నాన్నగారు నర్సాపురం నుంచి పోటీ చేస్తుండడంతో మా కుటుంబం ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వామ్యం అయినట్లే. కానీ.. నాన్నగారు పోలిటికల్ ఎంట్రీ టైమ్ కి నేను “సూర్యకాంతం” రిలీజ్ టెన్షన్ లో బిజీగా ఉండడంతో ఇంకా నాకు ఆ పోలిటికల్ ఫీవర్ తగల్లేదు. కానీ.. రాజకీయాల్లోకి వెళ్తున్నాను అని నాన్న చెప్పినప్పుడు ఆయన్ని ఒకటే అడిగాను. మీరు పాలిటిక్స్ లోకి వెళ్ళండి, కళ్యాణ్ బాబాయ్ కి తోడుగా ఉండండి, కానీ.. దయచేసి రెగ్యులర్ పొలిటీషియన్స్ లా మాత్రం మీ భాషను మార్చేసుకోకండి అని మాత్రం అడిగాను. ఎందుకంటే.. నాకు ఆయన సరదాగా మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం.
కథ నా చుట్టూ తిరగాలి అని ఎప్పుడూ అనుకోను..
నేను ఇప్పటివరకూ చేసిన “ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్” సినిమాల్లో కథ నా పాత్ర చుట్టూ తిరగడం వలన.. నేను ఒక సినిమా సైన్ చేయాలంటే నా క్యారెక్టర్ హైలైట్ అవ్వాలని, నా పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరగాలని నేను కోరుకుంటానని ఒక రూమర్ తయారయ్యింది. నిజానికి నేను అలాంటి పిచ్చి కోరికలు అస్సలు కోరుకోను. ఒకట్రెండు పాటల్లో డ్యాన్స్ చేసి, నాలుగు సీన్స్ లో హీరోతో రొమాన్స్ చేసేసి.. హమ్మయ్య సినిమాలో నటించేశాను అని చంకలు గుద్దుకొనే టైమ్ కాదు నేను. నేను సినిమా మొత్తంలో ఉండేది రెండు సన్నివేశాలైన పర్లేదు.. నేను పోషించిన పాత్రకి ఒక మీనింగ్ ఉండాలి అని మాత్రమే కోరుకుంటాను. అలాంటి పాత్రలేవరైనా తీసుకొనే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా అస్సలు చూడను.
నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ..
హీరోయిన్ రోల్స్ మాత్రమే చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను సినిమాల్లోకి వచ్చిందే డిఫరెంట్ రోల్స్ చేయడానికి. సో, నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. నా ఫేస్ లో ఎలాగూ ఆ పొగరు ఉంటుంది కాబట్టి.. నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ అయితే.. ఇంకా బాగా యాక్ట్ అవుతానని నా నమ్మకం.
నేను అడుక్కొని మరీ చేసిన క్యారెక్టర్ అది..
మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయొచ్చు లేదంటే.. ఏవైనా పెద్ద సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. కానీ.. ఎందుకనో మొదటి నుంచి నాకు అలాంటి ఆలోచనలు లేవు. కానీ.. “సైరా నరసింహారెడ్డి” సినిమాలో చిన్న క్యారెక్టర్ మాత్రం నేను అడుక్కొని మరీ చేశాను.
నేను శైలజలో హీరోయిన్ గా నన్ను అనుకున్నారు..
నిజానికీ “నేను శైలజ” చిత్రంలో హీరోయిన్ గా నన్ను అనుకున్నారు. కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు నన్ను చాలాసార్లు అడిగారు కూడా. కానీ.. అప్పటికి ఇంకా నేను హీరోయిన్ అవ్వాలి అనుకుంటున్నాననే విషయం ఇంట్లో చెప్పలేదు. దాదాపు మూడు నాలుగు వారాలు వెయిట్ చేసిన తర్వాత నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడంతో కీర్తి సురేష్ ను తీసుకున్నారు.
అత్యంత నీచమైన రూమర్ అది..
ఇండస్ట్రీలోకి వచ్చే ముందే.. అందరూ నన్ను ప్రిపేర్ చేశారు. ఇలాంటి చాలా రూమర్స్ వస్తాయి. వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండూ అని చెప్పారు. కానీ.. నా నమ్మకం ఏంటంటే.. నిప్పు లేకుండా పొగ రాదు కదా.. సో నా మీద పెద్దగా రూమర్స్ ఏమీ రావులే అనుకున్నాను. కానీ కొన్ని రూమర్స్ చూసిన తర్వాత బాబోయ్.. అసలు నిప్పు లేకుండా ఇంత పొగ ఎక్కడ్నుంచి వస్తుందో అర్ధం కాలేదు. ముందు నాగశౌర్య, తర్వాత ప్రభాస్, రీసెంట్ గా విజయ్ దేవరకొండ. ఇలా చాలా మందితో నా ప్రేమ అని పెళ్లి అని రూమర్స్ వచ్చినప్పుడు కామన్ లే అనుకున్నాను. కానీ.. సాయిధరమ్ తేజ్ నాకు రిలేషన్ పరంగా బావ కానీ.. తను నన్ను ఎప్పుడు ఒక చెల్లెల్లా చూశాడు. కానీ.. ఏదో ఈవెంట్ లో తను నన్ను ముద్దు పెట్టుకోవడం చూసి చాలామంది నేను తనని పెళ్లి చేసుకోబోతున్నాని రూమర్స్ క్రియేట్ చేశారు. నాకైతే చాలా కోపమొచ్చింది. వెంటనే తేజ్ రెస్పాండ్ అయ్యి ఆ రూమర్స్ ని క్లియర్ చేశాడు.
సోషల్ మీడియా ట్రోలింగ్ ను నేను పెద్దగా పట్టించుకోలేదు..
ఒక వ్యక్తి నా ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ప్రొఫైల్ ను ఇంటర్నెట్ లో వెతికి, వచ్చి నా ఫోటో చూసి.. ఏదో ఒక ఫోటో మీద కామెంట్ చేస్తున్నాడు. వాడు చెడుగా కామెంట్ చేయడం వలన నాకు పోయేది ఏమీ లేదు. నా చెక్ రాకుండా ఆగిపోదు కదా. సో, అలా వల్గర్ కామెంట్స్ చేసేవాళ్ళందరూ మెంటలోళ్లని నేను ఫిక్స్ అయిపోయాను. కాకపోతే.. నన్ను కాకుండా నా స్నేహితులను, నా బంధువులను కామెంట్ చేసినప్పుడు మాత్రం కోపం వస్తుంది. సింపుల్ గా అలాంటి కామెంట్స్ డిలీట్ చేసి ఊరుకుంటాను.
ఆ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళందరూ త్వరగానే చచ్చిపోతారు..
ఇప్పుడు హీరోయిన్స్ ను ఆబ్జెక్టిఫై చేయడం అనేది చాలావరకు తగ్గింది. కాకపోతే.. కొందరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు. రీసెంట్ రాధారవి లాంటి సీనియర్ యాక్టర్ నయనతార మీద చేసిన కామెంట్స్ చూసినప్పుడు బాధ అనిపిస్తుంటుంది కానీ.. అలాంటి మైండ్ సెట్ ఉన్న ముసలోళ్ళు అందరూ త్వరగానే పోతారండి. నవతరంలో చాలా మార్పు వస్తుంది. హీరోయిన్ ని సెక్స్ ఆబ్జెక్ట్ లా కాకుండా ఒక అమ్మాయిలా చూసే రోజులు త్వరలోనే వస్తాయి.
అలా చేస్తే నేను కూడా బూతులు తిడతాను..
కొంతమంది ఎలా ఉంటారంటే.. అమ్మాయిలు చీరలు కట్టుకోవడం లేదు, అబ్బాయిలు ఆ పొట్టి డ్రెస్సుల్లో అమ్మాయిల్ని చూసి ఏదో అయిపోతున్నారు. అందుకే రేపులు జరుగుతున్నాయి అని పిచ్చిగా వాదిస్తుంటారు. వాడి కళ్లను కంట్రోల్ లో పెట్టుకోలేకపోయినోడిది తప్పు కానీ.. పొట్టి డ్రెస్ వేసుకున్న అమ్మాయిది కాదు. అమ్మాయిలంటే ఇలానే ఉండాలి అని రూల్స్ పెట్టడం కూడా సరైనది కాదు. ఇప్పుడు ఎవడైనా వచ్చి నన్ను తాకరాని చోట తాకితే నేను “ఏవండీ వెధవ గారు అలా చేయకూడదండీ” అని అనను కదా. నాకు తెలిసిన అతి పెద్ద బూతు మాటే తిడతాను. కుదిరితే లాగిపెట్టి ఒకటి కొడతాను.
సూర్యకాంతంలో కొత్త నీహారికను చూస్తారు..
ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది. అబ్బాయిలకు బ్రేకప్ అయితే బార్ కి వెళ్ళి మందు కొడతారు, అమ్మాయిలకు బ్రేకప్ అయితే వంటింట్లో కూర్చుకొని దోసలు వేయాలా? అని. నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా, యాటిట్యూడ్ పరంగా ఒక కొత్త నీహారికను చూస్తారు. అలాగే.. నా భవిష్యత్ సినిమాల సెలక్షన్ పరంగానూ చిన్న చిన్న మార్పులు వస్తాయి.
ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు..
నాకు మెగా ఫ్యామిలీ కాకుండా ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు. అన్నయ్యతో రెండు సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠి ఒక్కర్తే నాకంటూ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక ఫ్రెండ్. నేను ఈ పార్టీస్ లో పెద్దగా తిరగను, నా క్లోజ్ కాలేజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే హ్యాంగ్ అవుతూ ఉంటాను.
నాకు తెలుగు అన్నా, తెలుగు పాటలన్నా ప్రాణం..
కాలేజ్ టైమ్ లో పార్టీస్ అంటే ఏదో పిచ్చి ఉండేది. అందుకే పార్టీలకి వెళ్ళి తెగ ఎగిరేసేదాన్ని. ఒక 20, 30 పార్టీలకు వెళ్ళాక ఆ గోల, ఆ చెమట కంపు చిరాకొచ్చింది. అందుకే.. ఇప్పుడు ఫ్రెండ్స్ తో సరదాగా ఏదైనా తెలుగు బ్యాండ్స్ ప్లే అవుతున్న ప్లేసస్ కి వెళ్తాను తప్పితే.. ఆ పబ్ లు, పార్టీలు నా వల్ల కాదండీ. అయినా.. తెలుగు వాళ్ళం అయ్యుండి తెలుగు పాటలు వినడానికి, తెలుగులో మాట్లాడడానికి కొందరు ఎందుకు ఇబ్బందిపడటారో నాకు అర్ధం కాదు. నేను మాత్రం తెలుగు పాటలే వింటాను, తెలుగులోనే మాట్లాడతాను.
అలాంటి ట్రయినింగేమీ తీసుకోలేదు నమ్మండి..
“ఒక మనసు” సినిమా రిలీజ్ కి ముందు నేను మొదటిసారి మీడియాను ఫేస్ చేశాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా క్లారిటీగా ఆన్సర్ చేశాను. ఆ ప్రెస్ మీట్ నుంచి ఇంటికి వెళ్ళాక నాన్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ.. “అలా మాట్లాడావేంటి?” అని అడిగారు. తప్పు ఏమైనా మాట్లాడానా అని భయపడ్డాను. చాలా బాగా, మెచ్యూర్డ్ గా మాట్లాడాను అని నాన్నగారు చెప్పడంతో హమ్మయ్య అనుకున్నాను. ఇప్పటికీ చాలామంది అడుగుతారు.. ప్రెస్ మీట్స్ అటెండ్ అవ్వడం కూడా ట్రయినింగ్ తీసుకున్నావా అని (నవ్వుతూ).
నేను ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి కారణం అదే..
ఇలా సోషల్ మీడియా ట్రోలింగ్ కి, సినిమాలు ఫెయిల్ అయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లకపోవడానికి కారణం నాకు 4వ తరగతి చదువుతున్న టైమ్ లో నా టీచర్ నాకు చెప్పిన విషయమే. ప్రతి ఒక్కరూ వారి చూట్టూ ఒక నీటి బుడగ లాంటి లేయర్ ను ఏర్పరుచుకోవాలి. ఆ లేయర్ దాటి మీ దగ్గరకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకోవాలి. అప్పుడు ఎలాంటి బాధలు మనకి ఉండవు. నేను ఇప్పటికీ అదే ఫాలో అవుతాను.
కళ్యాణ్ బాబాయ్ నా ఒక్క సినిమా కూడా చూడలేదు..
ఇప్పటివరకూ కళ్యాణ్ బాబాయ్ నేను యాక్ట్ చేసిన సినిమా ఒక్కటి కూడా చూడలేదు. కానీ.. చరణ్, అర్జున్, వరుణ్ మాత్రం నా సినిమాలు చూసి ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఉంటారు. “సూర్యకాంతం” టీజర్ చూసి చరణ్ “ఇది నీకు కరెక్ట్ సినిమా, అందులో 12345 కోస్కో అనే క్యారెక్టర్ నీదే” అని ఏడిపించేవాడు.
– Dheeraj Babu