కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా, శ్రేయా శర్మను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్. మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ నిర్మలా కాన్వెంట్ చిత్రాన్ని నిర్మిస్తుంది. జి.నాగ కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించిన నిర్మలా కాన్వెంట్ ఆడియో రిలీజ్ కార్యక్రమం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. బిగ్ సిడీను అల్లు అరవింద్ ఆవిష్కరించగా…ఆడియో సిడీను నిమ్మగడ్డ ప్రసాద్ ఆవిష్కరించి ఫస్ట్ సిడీని అల్లు అరవింద్ కి అందచేసారు. థియేట్రికల్ ట్రైలర్ ను హీరో గోపీచంద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ జి.నాగకోటేశ్వరరావు మాట్లాడుతూ…. ఈ సినిమాకి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్ గార్కి, నాగార్జున గార్కి రుణపడి ఉంటాను. ఈ సినిమా విషయానికి వస్తే…ప్రపంచంలో ప్రేమకు మించిన స్పూర్తి మరొకటి లేదు అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్, రాజీవ్ కనకాల, సుమ గార్ల అబ్బాయి రోషన్, ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాసన్ ని పరిచయం చేస్తున్నాం. ఇక ఈ చిత్రంలో నాగార్జున గారు స్పెషల్ రోల్ చేసారు. ఆయన క్యారెక్టర్ సెకండాఫ్ అంతా ఉంటుంది. నాగార్జున గారు మాత్రమే చేయగల పాత్ర అది. కోటి గారి అబ్బాయి రోషన్ సాలూరి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. కొత్త కొత్త భాష..అంటూ సాగే సాంగ్ ఎక్స్ లెంట్ గా ఉంది. ప్రతి పాట సందర్భానుసారంగా ఉంటుంది. అనంత్ శ్రీరామ్ అద్భుతమైన పాటలు అందించారు. ఎ.ఆర్.రెహమాన్ గారి అబ్బాయి కొత్త కొత్త భాష పాట పాడారు. ఇదే పాటను కింగ్ నాగార్జున గారు పాడడం విశేషం. అక్కినేని నాగార్జున గారి అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి చిత్రాలతో విజయాలు సాధించిన నాగార్జున గారు ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ తో సక్సెస్ సాధించి ఒకే సంవత్సరంలో హ్యాట్రిక్ సాధించిన హీరోగా రికార్డ్ సృష్టిస్తారు అని నా గట్టి నమ్మకం అన్నారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ…. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్నో చిత్రాలకు సంగీతం అందించాను. అక్కినేని గారి సినిమాలకు మా నాన్నగారు సంగీతం దర్శకత్వం వహించి ఎన్నో గొప్ప పాటలు అందించారు. నేను నాగార్జున బాబుతో నాలుగు సినిమాలుకు వర్క్ చేసాను. మా అబ్బాయి రోషన్ కొత్త కొత్త భాష ట్యూన్ వినిపించి రెహమాన్ కొడుకుతో పాడించాలి అని చెప్పాడు. రెహమాన్ ని అడిగితే 10 డేస్ తర్వాత పాడిస్తాను ట్యూన్ పంపించమన్నాడు. అలా మా అబ్బాయిని రెహమాన్ దీవిస్తే…ఆతర్వాత అంతగా దీవించింది కింగ్ నాగార్జున గారు. నా జీవితంలో మారచిపోలేని రోజు ఈరోజు. ఎందుకంటే…నా గురువు చక్రవర్తి గారి పుట్టినరోజు ఈరోజు. అలాగే నా పెద్ద కొడుకు పెళ్లి కుదిరింది ఈరోజే. మా అబ్బాయి ఆడియో రిలీజ్ అయ్యింది ఈరోజే.ఇంత కంటే ఏం కావాలి…అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. మా అబ్బాయిని ఆదరించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ… నాకు ఈ స్టేజ్ పై నిలబడే అర్హత ఇచ్చిన నాగ్ సార్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. మంచితనం ఉన్న ధైర్యవంతుడు నాగ్ సార్. అందరూ మంచివాళ్లే…. కాకపోతే కొత్తవాళ్లతో చేస్తే ఏమౌతుందో అని ఆలోచించి రిస్క్ చేయరు. కానీ… రిస్క్ అయినా సరే కొత్త వాళ్లను ప్రొత్సహించాలి అనే ధైర్యవంతుడు నాగార్జున. ఆయన వలనే నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలు హీరోలు ఉన్నప్పటికీ…. నా సాటి హీరో అబ్బాయి కూడా హీరో అవ్వాలి అని శ్రీకాంత్ గారి అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎవరో తెలియని ఎక్కడో ఉన్న రాజ్ తరుణ్ ని ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోని చేసారు. కొత్త వాళ్లను ప్రొత్సహించే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఏదైనా సరే… వాస్తవ దృక్పధంతో ఆలోచిస్తారు. ఇక శ్రీకాంత్ గారు గురించి చె్ప్పాలంటే…ఆపరేషన్ దుర్యోధన సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసాను. శ్రీకాంత్ గారు మంచి నటుడు అలాగే మంచి వ్యక్తి. రోషన్ కూడా అలాగే పేరు తెచ్చుకోవాలి. సంగీత దర్శకుడు రోషన్ నాగ్ సార్, రెహమాన్ గారి అబ్బాయితో పాటలు పాడించారు. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే మా బంగారం మనసు బంగారం చేయి బంగారం. సో…నిర్మలా కాన్వెంట్ సినిమా ద్వారా పరిచయం అవుతున్న అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు
ప్రభాకర్ మాట్లాడుతూ… సీతారామరాజు సినిమాలో నాగార్జున గారితో కలిసి నటించాను. హరికృష్ణ గారు, నాగార్జున గారి కాంబినేషన్ సీన్ లో చిన్న డైలాగ్ చెప్పాను. అప్పటి నుంచి నాగార్జున గారితో వర్క్ చేయాలనుకున్నాను. కానీ అవకాశం రాలేదు. నాగార్జున గారు నిర్మించిన చిత్రంలో మా అబ్బాయికి అవకాశం రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి చంద్రహాస్ అన్నా చెల్లెలు సీరియల్ లో నటించాడు. నిర్మలా కాన్వెంట్ లో సెలెక్ట్ అవ్వడం అనేది వాడి అదృష్టం. ఈ సినిమా కోసం అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ… నేను మాత్రం కళ్లు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నాను. నిర్మలా కాన్వెంట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ… అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నుంచి మా అబ్బాయి రోషన్ పరిచయం కావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆటో డ్రైవర్ లో సినిమాలో నాగార్జున గారితో కలిసి నటించాను. ఇప్పుడు మా అబ్బాయికి నాగార్జున గారితో కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్ గార్కి, నాగార్జున గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
సుమ మాట్లాడుతూ… నేను యాంకర్ అవుతాను అనుకోలేదు అయ్యాను. అలాగే మా అబ్బాయి నటుడు అవుతాడు అనుకోలేదు అదీ జరిగింది. మా అబ్బాయికి నాగార్జున గారితో వర్క్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కోటి గారి అబ్బాయి రోషన్ చాలా మంచి పాటలు అందించాడు. ముఖ్యంగా ఒకే చిత్రంలో వైవిధ్యమైన పాటలు అందించాడం బాగుంది అన్నారు.
నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ… మా సినిమాలో నాగార్జున గారితో పాటు శ్రీకాంత్ తనయుడు రోషన్, కోటి గారి అబ్బాయి రోషన్, దేవదాస్ కనకాల మనవడు రోషన్ కనిపిస్తుండడం చూస్తుంటే నిర్మలా కాన్వెంట్ పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది అన్నారు.
శ్రేయా శర్మ మాట్లాడుతూ… నిర్మలా కాన్వెంట్ నాకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. నాగార్జున గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీకి వర్క్ చేయడం అనేది గ్రేట్ ఎక్స్ పీరియన్స్. రోషన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. నా తొలి చిత్రం జై చిరంజీవి నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఎప్పటిలాగే నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…. రోషన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకోలేదు. అనుకోకుండా రుద్రమదేవి చిత్రంలో రానా చిన్నప్పటి క్యారెక్టర్ చేయడం జరిగింది. జి.కె ఈ సినిమా కథ చెప్పి రోషన్ కావాలి అనగానే నిర్మాత ఎవరు అని అడిగాను. నాగార్జున గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు అని చెప్పారు. అలా చెప్పగానే మంచి సినిమా అవుతుంది రోషన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. రోషన్ కి చెప్పగానే చేస్తాను అన్నాడు. సినిమా అంటే చాలా కష్టపడాలి అమ్మ నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాం అని చెప్పాను. కష్టపడతాను నేను చేస్తాను అన్నాడు హ్యపీగా ఫీలయ్యాను. సెట్ లో ఎలా ఉంటాడో అని కాస్త భయం ఉండేది. ఓసారి సెట్ కి వెళ్లి చూసాను సెట్ లో చాలా కాన్పిడెంట్ ఉన్నాడు. టెన్షన్ పడనవసరం లేదు అనిపించింది. ఇప్పుడు గర్వంగా ఉంది. ఈ సినిమా ఒప్పుకోకుండా ఉండి ఉంటే పెద్ద అవకాశం మిస్ అవ్వేవాళ్లం అనిపించింది. ఓరోజు నాగార్జున గారితో సీన్ చేయాలి కాస్త టెన్షన్ గా ఉంది అన్నాడు. నువ్వు ఏం టెన్షన్ పడకు ఆయన కొత్తవాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పాను. కోటి గారి అబ్బాయి రోషన్ మంచి మ్యూజిక్ అందించాడు. నాన్న గారిని మించిపోవాలి.ఈ సినిమాకి అందరి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
ఊహ మాట్లాడుతూ… రోషన్ కి ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా చాలా లక్కీ. నాగార్జున గారితో వర్క్ చేసాను అని అందరూ చెబుతున్నారు కానీ…నాకు అదృష్టం దక్కలేదు. మా అబ్బాయికి రోషన్ కి ఆ అదృష్టం దక్కింది. అవకాశం ఇచ్చిన నాగార్జున గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
శ్రీకాంత్ తనయుడు హీరో రోషన్ మాట్లాడుతూ…. ఇది ఫ్రెష్ ఫ్యూర్ లవ్ స్టోరి. చిన్నపిల్లల లవ్ స్టోరీ అని కొంత మంది తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇది టీనేజ్ లవ్ స్టోరీ. ఈ మూవీకి డైరెక్టర్ నాగ కోటేశ్వరరావు గారు ఎంత టెన్షన్ పడుతున్నారో నేను అంతే టెన్షన్ పడుతున్నాను. ఈ మూవీకి జి.కె గారు చాలా హార్డ్ వర్క్ చేసారు. శ్రేయా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కి నేను రియాక్షన్ ఇస్తే సరిపోయేది. రోషన్ సాలూరి సూపర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా గురించి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే…అది కింగ్ నాగార్జున గార్కి చెప్పాలి. పెద్ద హీరో అయినప్పటికీ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేయడం అంటే సినిమా పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నేను ఈ సినిమా చేసాను అంటే కారణం నాగార్జునరే. నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ప్రేక్షకాభిమానులే అసలైన దేవుళ్లు. మా సినిమాని ఆదిరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ… సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా కథ తెలుసు మంచి స్టోరీ. రోషన్ మంచి సినిమాలు చేస్తూ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ… నాకు చిన్నప్పుడు మా తాత గారు రాబోయే తరం గురించి ఆలోచించాలి అని చెప్పారు. ఆ విషయం బాగా గుర్తుంది. ఈ సినిమా గురించి జికె చెప్పినప్పుడు… రాబోయే తరం గురించి మా తాత చెప్పిన మాట గుర్తుకువచ్చి ఒప్పుకున్నాను. మ్యూజిక్ విన్నప్పుడు మంచి మూవీ అవుతుంది అనిపించింది. రోషన్స్ మాట్లాడడం చూస్తుంటే… మనందరం గర్వపడేలా చేస్తారని అనిపించింది. ఈ సినిమా చేయడానికి నా హితుడు స్నేహితుడు నాగార్జున మరో కారణం. నేను కూడా ఏక్ట్ చేస్తాను చెప్పి ఈ చిత్రంలో నటించారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…. నిమ్మగడ్డ ప్రసాద్ గారు నాకు నాగార్జున గారికి బాగా కావాల్సిన మనిషి. ఆయనకి బాహుబలి లాంటి సినిమాలు నిర్మించగల శక్తి ఉండి కొత్తవాళ్లతో ఈ సినిమా తీయడాన్ని మెచ్చుకోవాలి. ఓరోజు సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే…. కొత్తదనం ఎక్కడ ఉన్నా పట్టుకుని ముందుకు వెళ్లే ధైర్యం నాగార్జునలో ఉంది. రిస్క్ అని ఏమాత్రం భయపడని మనిషి నాగార్జున అని బన్ని అన్నాడు. ఇక ఈ సినిమాకి వెనకుండి నడిపించిన జికెను అభినందిస్తున్నాను. శ్రీకాంత్ అబ్బాయి రోహిత్ చాలా చక్కగా మాట్లాడాడు. సినిమాలో ఇంకెంత బాగా నటించాడో అనిపిస్తుంది. ఎక్స్ లెంట్ సాంగ్స్… ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ…. నా వాయిస్ బాగోదు అని ఫ్యాన్స్ అన్నారు. ఇంట్లో వాళ్లు అన్నారు. కొంత మంది డైరెక్టర్స్ అన్నారు. అలాంటిది రోషన్ వచ్చి సార్ మీ వాయిస్ బాగుంది పాట పాడాలి అనగానే పాడేసాను. ఇక హీరో రోషన్ గురించి చెప్పాలంటే… పెంటాస్టిక్ అదగొట్టేసాడు. చాలా కాన్సిడెంట్ గా చేసాడు. శ్రీకాంత్ అంటే నాకు బాగా ఇష్టం. వాళ్ల అబ్బాయి రోషన్ ని హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. శ్రియ చాలా బాగా నటించింది. నాన్న గారు ఎప్పుడూ కొత్తదనం కోసం తపించేవారు. మాకు నాన్న గారే స్పూర్తి. ఈ సినిమా ద్వారా మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు, డైరెక్టర్ నాగ కోటేశ్వరరావు, ఆర్టిస్టు రోషన్, చంద్రహాస్, ఎఆర్ అమీన్, సిద్దార్ద, రోషన్ సాలూరి, డిఓపి విశ్వేశ్వరరావు, సింగర్ నాగార్జున…ఇంత మంది కొత్తవాళ్లు పరిచయం అవుతుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నేను సెకండాఫ్ అంతా ఉంటాను. ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నా ఫ్యాన్స్ కోసం మాట్లాడాలంటే…. ఓం నమో వేంకటేశాయ సినిమా చేస్తున్నాను. చైతన్య తో కళ్యాణ్ కృష్ణ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. జగపతిబాబు కూడా నటిస్తున్నారు. నాకు మనం అనే క్లాసిక్ అందించిన విక్రమ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో కొత్త అబ్బాయి అఖిల్ నటిస్తున్నాడు. రీ లాంఛ్ ఫిల్మ్ ఇది. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి అన్నారు.
Read Today's Latest
Movie News Update. Get
Filmy News LIVE Updates on FilmyFocus