నిర్మలా కాన్వెంట్

ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయక నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో వంద సినిమాల్లో నటించడమే కాక ఇండస్ట్రీలోని అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించిన ఏకైక హీరోగా పేరు తెచ్చుకొన్న అజాత శత్రువు శ్రీకాంత్ తనయుడు రోషన్ పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన చిత్రం “నిర్మలా కాన్వెంట్”. జి.నాగ కోటేశ్వర్రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మింఛడంతోపాటు ఈ చిత్రంలో ఓ కీలకభూమిక పోషించడం విశేషం. మరి తండ్రి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న రోషన్ కథానాయకుడిగా ఏరేంజ్ లో అలరించాడో చూద్దాం..!!

కథ : విశాఖపట్నంకు కూతవేటు దూరంలోని ఎస్.కోట దగ్గరలోని భూపతినగరానికి చెందిన రాజవంశానికి వారసురాలు శాంతి (శ్రేయా శర్మ). అదే గ్రామంలోని దళిత కుటుంబానికి చెందిన నిరుపేద యువకుడు శామ్యూల్ (రోషన్). ఇద్దరూ ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిన “నిర్మలా కాన్వెంట్”లో చదువుతుంటారు. హీరోహీరోయిన్ కాబట్టి వీరు ప్రేమలో పడడం.. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం చకచకా జరిగిపోయాక, హీరోయిన్ ని పెళ్ళి చేసుకోవాలంటే కోట్ల రూపాయలు సంపాదించడంతోపాటు.. పేరుప్రతిష్టలు కూడా తెచ్చుకోవాలని కండిషన్ పెడతాడు హీరోయిన్ ఫాదర్ (ఆదిత్య మీనన్).

16 ఏళ్ళ శామ్యూల్ తన ప్రేమ కోసం కోట్లు సంపాదించగలిగాడా? అతడి ఆశయ సాధనకు అక్కినేని నాగార్జున ఏ విధంగా సహాయపడగలిగాడు? అనేది “నిర్మలా కాన్వెంట్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు!

నటీనటుల పనితీరు : బాల నటుడిగా “రుద్రమదేవి” చిత్రంలోనే తన డైలాగ్ డెలివరీతో, లుక్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న రోషన్ “నిర్మలా కాన్వెంట్”లోనూ అదే తరహాలో అలరించాడు. వయసులో చిన్నవాడే అయినప్పటికీ.. ఫీలింగ్స్ ను కేవలం కళ్ళతోనే ఎలివేట్ చేయగలిగాడు. కాకపోతే.. సినిమాలోని శామ్యూల్ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం మైనస్ అయ్యింది. అప్పటివరకూ పుస్తకాల పురుగులా ఉన్న శామ్యూల్ ఒక్కసారిగా “ప్రేమ భాష, ముద్దు భాష” అంటూ హీరోయిన్ కి ప్రేమపాఠాలు చెప్పడానికి ఎందుకు ఉబలాటపడతాడో అర్ధం కాదు.
ఇక చిన్నప్పట్నుంచి “జయ చిరంజీవ, రోబో, దూకుడు” వంటి చిత్రాల్లో తన ముద్దులోలికే ముఖారవిందంతో ఆడియన్స్ ను అలరించిన శ్రేయా శర్మ “నిర్మలా కాన్వెంట్”లోనూ తన అభినయంతో ఆకట్టుకొంది. అక్కడక్కడా వయసుకు మించిన అందాల ప్రదర్శన చేసినప్పటికీ ఆమె హావభావాలు మాత్రం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి.

ఇక నాగార్జున పోషించిన ప్రత్యేక పాత్రకు వేల్యూ లేకుండా పోయింది. నటన పరంగా కింగ్ నాగార్జునకు పేరు పెట్టాల్సిన పని లేకపోయినప్పటికీ.. సినిమాలో “చాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్” షో కి హోస్ట్ గా నటించిన నాగార్జున అటు బుల్లెతెరకు-వెండితెరకు మధ్య బ్యాలెన్స్ చేయలేక చాలా సన్నివేశాలో తడబడ్డాడు. ఆదిత్య మీనన్, సూర్య, తాగుబోతు రమేష్, అనితా చౌదరి తదితరులు అలరించడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా సత్ఫలితాన్నివ్వలేకపోయాయి.

సాంకేతికవర్గం పనితీరు : సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయి రోషన్ సాలూరి సమకూర్చిన బాణీలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకొనేలా ఉంది. ఎస్.వి.విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ రెగ్యులర్ గానే ఉంది. కానీ.. హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కు పెట్టిన టైట్ క్లోజ్ లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే.. పాటల చిత్రీకరణ మాత్రం బాగుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది, డిఐ వర్క్ సినిమాకి మరో ఆకర్షణలా నిలిచింది.

దర్శకత్వ శాఖలో అనుభవం లేకపోవడం వల్లనో లేక దర్శకుడి మైండ్ సెట్ ఇంకా 80వ దశకంలోనే ఆగిపోవడం వల్లనో తెలియదుకానీ.. దర్శకుడు జి.నాగకోటేశ్వర్రావు రాసుకొన్న కథ-కథనం నేటితరానికి ఏమాత్రం ఇమడని విధంగా ఉన్నాయి. కథ విషయంలో బాలీవుడ్ చిత్రం “స్లమ్ డాగ్ మిలీయనీర్”, కన్నడ చిత్రం “మైత్రి”ల నుంచి స్పూర్తి పోందిన కోటేశ్వర్రావు కథనం విషయంలో మాత్రం సొంతంగా ఆలోచించి గంటన్నరోలో అయిపోవాల్సిన సినిమాని రెండున్నర గంటలపాటు సాగదీసి.. ధియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు ఏదో మాటీవీలో సీరియల్ ను చూస్తున్న అనుభూతిని కలిగించాడు.

విశ్లేషణ : శ్రీకాంత్ కొడుకు హీరోగా పరిచయం అయ్యాడు, నాగార్జున స్పెషల్ రోల్ ప్లే చేశాడు అనే ఆలోచన ప్రేక్షకుడ్ని కేవలం థియేటర్ వరకూ మాత్రమే తీసుకురాగలుగుతుంది. థియేటర్ లో కూర్చున్నాక ఆడియన్స్ ను అలరించాల్సింది కథ-కథనం. “నిర్మలా కాన్వెంట్”లో ఈ రెండూ లోపించాయి. “పేదింటి హీరో శ్రీమంతురాలైన హీరోయిన్ ను లవ్ చేయడం, ఆ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం, హీరో ప్రేమ కోసం కష్టపడో, తెలివిని ఉపయోగించో డబ్బులు సంపాదించడం” అనే కాన్సెప్ట్ 1960 నుంచి తెలుగు సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. అందువల్ల “నిర్మలా కాన్వెంట్” కథ-కథనాల పరంగా చాలా పేలవంగా ఉంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం హీరో కంటే అన్నపూర్ణ స్టూడియోస్, మాటీవీ, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ను ప్రమోట్ చేసుకోవడానికే డిజైన్ చేసినట్లుగా ఉంటుంది.

రేటింగ్ : 2/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus