విశ్వనటుడు కమల హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో నటనకు దూరం కానున్నారు. అయితే సినిమా రంగానికి మాత్రం టచ్ లోనే ఉండనున్నారు. సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఒక క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు కమల్ బ్యానర్లో వచ్చిన తూంగావనం(చీకటి రాజ్యం) చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేశ్ సెల్వని డైరక్టర్ గా తీసుకున్నారు. ఫ్రెంచ్ సినిమా కథతో తెరకెక్కనున్న ఇందులో హీరోగా విక్రమ్ ఖరారు అయ్యారు. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నితిన్ నటించబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఈరోజు నితిన్ స్పందించారు.
అతను నటించిన “ఛల్ మోహన్ రంగ” వచ్చేనెల 5 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నితిన్ అనేక విషయాలు చెప్పారు. ప్రస్తుతం తాను శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు వివరించారు. అలాగే కమల్, విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ చేయడం లేదని స్పష్టం చేశారు. “కమల్ హాసన్ నిర్మించే సినిమాలో నాకు అవకాశం రావడం సంతోషకర విషయం. అయితే నా ప్రాజెక్ట్స్ కి డేట్స్ కేటాయించడం వల్ల ఆ సినిమా చేయలేకపోతున్నాను” అని నితిన్ తెలిపారు.