‘పెద్దపులి’ అంటూ పాడుతూ చిందేస్తున్న ‘నితిన్’

నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”లో రీక్రియేట్ చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలంగాణ సంస్కృతిని, పెద్దమ్మ తల్లి గొప్పతనాన్ని చాటుతూ బోనాల సంబరాలలో పాడుకునే పాట “పెద్ద పులి”. ఆ పాటని అంతే గొప్పగా, దాని స్థాయి ఏ మాత్రం తగ్గకుండా సంగీత దర్శకులు థమన్ మరియు సాహిత్య రచయిత సాహితి గారు చాలా జాగ్రత్తగా రీక్రియేట్ చేశారు.

పెద్ద పులి లాంటి పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే, అదీ తెలంగాణ వాస్తవ్యుడైన నితిన్ 25వ చిత్రం అయితే, దానికి థమన్ తన ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్ తో దానిని వేరే స్థాయికి తీసుకుని వెళ్తే, వీటన్నిటికీ మించి ఆ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్ మాస్ స్టెప్స్ వేస్తే, ఇంకేముంది, థియేటర్లో ఫ్యాన్స్ కి సంబరాలే…..

సాహితి గారు అసలైన తెలంగాణ పదాలను వాడుతూ, పాటలో ప్రాస యాస ఏ మాత్రం తగ్గకుండా, వినడానికి పాడుకోవడానికి సులభంగా ఉండేలా వ్రాసారు.

ఈ మధ్యన ఫోక్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాహుల్ సిపిలిగంజ్ ఈ పాటని పాడారు. ఈ గీతం నిన్న రాత్రి వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ లో యువత కేరింతలు,ఉత్సాహాల నడుమ విడుదల అయింది.

ఈ చిత్రానికి ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus