హీరోయిన్లయందు నిత్య మీనన్ (Nithya Menen) వేరయా! అని కాన్ఫిడెంట్‌గా చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆమె ఎంచుకునే కథలు, సినిమా కోసం ఆమె పడే కష్టం అలా ఉంటుంది మరి. సినిమా అంటే నటనకు మాత్రమే ఆమె పరిమితం కాలేదు. గాయనిగాను తన టాలెంట్‌ను చూపించింది. అలా అని వచ్చిన ప్రతి కథను ఓకే చేసి ముందుకెళ్లే రకం కాదు. ఇక కమర్షియల్ కథలు, పాత్రలు చేసే రకం అంతకంటే కాదు. ఈ విషయంలో మరోసారి అందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
కెరీర్ ప్రారంభం నుండి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అలరిస్తోంది నిత్య మీనన్. ఈ క్రమంలో ఇటీవల ‘తిరు చిట్రంబళం’ (Thiruchitrambalam) సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలా ఓ ఇంటర్వ్యూలో తన కథల ఎంపిక, సినిమాలను చూసే విధానం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే తనకు జాతీయ అవార్డు వచ్చిన విషయం గురించి కూడా మాట్లాడింది.
జాతీయ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కోరుకోలేం కదా. ఎందుకంటే నేను ఎంచుకున్న రంగం అలాంటిది. అందుకే నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలు అనుకుంటాను. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలను ఎంపిక చేసుకుంటున్నా. అంతేకానీ బడ్జెట్ ఇతర అంశాలను పట్టించుకోను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వస్తే కచ్చితంగా నో చెప్పేస్తా. ఎందుకంటే అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి లేదు అని తేల్చేసింది.
అలాగే మంచి పాత్ర వస్తే.. చిన్న సినిమానైనా అంగీకరిస్తా. అంతేకాదు అది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తాను. కథ, పాత్రల విషయంలో నా ఆలోచన అలా ఉంటుంది. అందరూ అనుసరిస్తున్న మార్గంలో నేను వెళ్లాలన్న రూల్ లేదు కదా అని తన ఆలోచనా విధానం గురించి చెప్పింది. ప్రస్తుతం నిత్య పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) ఓ సినిమా చేస్తోంది. ‘గోల్డెన్ వీసా’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. దీంతోపాటు ధనుష్ (Dhanush) సరసన ‘ఇడ్లీకడై’ చేస్తున్నారు.