‘ఆదిపురుష్’ సినిమా రోజులు గుర్తున్నాయా? మిగిలిన హీరోల ఫ్యాన్స్, సగటు ప్రేక్షకులు మరచిపోతారేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోయారు. అంతలా వారిని ఆ సినిమా హర్ట్ చేసింది. ఎందుకు? ఏంటి? అనేది చూస్తే ఆ సినిమా చూపించిన విధానం, తెరకెక్కించిన విధానం ప్రస్తావనకు వస్తాయి. ఈ రెండూ కాకుండా రామాయణ ఇతిహాసాన్ని, అందులోని పాత్రలను తనకు నచ్చినట్లుగా దర్శకుడు ఓం రౌత్ మార్చేశారు అనే విమర్శలు కూడా గుర్తుకు వస్తాయి. అయినా ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా?
ఎందుకంటే అలాంటి మార్పులే మరోసారి రామాయణ ఇతిహాసంలో జరగబోతున్నాయని బాలీవుడ్ సమాచారం. ఈసారి కూడా బాలీవుడ్ డైరెక్టరే ఈ పని చేయబోతున్నారట. ‘రామాయణ’ పేరుతో నితీశ్ తివారీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా గురించి కొన్ని విషయాలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో కొన్ని పాత్రలకు సంబంధించి స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. తాజాగా దీనిపై దర్శకుడు నితీశ్ తివారీ పరోక్షంగా స్పందించారు.
ఇప్పటివరకు రామాయణాన్ని ఎంతోమంది రచించారని వాటన్నింటినీ చదివి, అందులోని అంశాల ఆధారంగా ‘రామాయణ’ సినిమాను రూపొందిస్తున్నట్లు నితీశ్ తివారీ తెలిపారు. రామాయణంపై కోర్సులు కూడా చేశానని, ఈ సినిమా కోసం ఇప్పటివరకూ ఎంతో మంది రాసిన ఇతిహాసాలను పరిశీలించానని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిజమైన విషయాన్ని ప్రేక్షకులకు అందిస్తామని నితీశ్ తివారీ తెలిపారు. ఈ సినిమా కోసం నిపుణులు చాలామంది స్క్రిప్ట్‌లో భాగమయ్యారని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.
సినిమా అధిక భాగం వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నారని.. శూర్పణఖతో మరికొన్ని పాత్రలను వేరే రామాయణ కథల నుండి తీసుకున్నారని వస్తున్న వార్తలకు ఇప్పుడు నితీశ్ తివారీ మాటలు ఊపిరిపోసినట్లు అయింది. రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్ సింగ్ కనిపిస్తారు. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి వస్తాయి.