‘బాహుబలి’ రెండు సినిమాలను కలిపి తమ ప్రమోషనల్ నేమ్‌ను యాడ్ చేసి ‘బాహుబలి: ది ఎపిక్’ అంటూ సిద్ధం చేస్తోంది రాజమౌళి అండ్ కో. ఈ నెలాఖరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీని కోసం ఆ సినిమాలకు ఎంత ప్రచారం చేశారో.. ఇప్పుడూ అదే స్థాయిలో చేయాలని ట్రై చేస్తున్నారు. అప్పటిలా లాంగ్ స్ట్రీక్ కలెక్షన్స్ ఉండవు కానీ.. విడుదలైన రోజైతే థియేటర్ల దగ్గర మామూలు హడావుడి ఉండదు. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా గురించి చిత్రబృందం రియాక్షన్స్ మొదలయ్యాయి. తొలుతగా హీరోయిన్ అనుష్క మాట్లాడింది.
అనుష్కకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు ఈ ‘బాహుబలి’ చిత్రాలు. అయితే అప్పట్లో సినిమాను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను అని అనుష్క చెప్పింది. ఇప్పుడు ‘బాహుబలి ది ఎపిక్’ అక్టోబరు 31న రానుండటంతో చాలా ఆనందంగా ఉంది అని అనుష్క చెప్పింది. ‘బాహుబలి’ సినిమాలు విడుదలైనప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీలు, ఇతర కారణాల వల్ల సినిమాను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఈసారి తనివితీరా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది.
కొన్ని నెలల క్రితం నిర్మాత శోభు యార్లగడ్డ తనకు ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా గురించి చెప్పారని, ఆలోచన ఆసక్తికరంగా అనిపించిందని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని.. మూడోసారి కూడా ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీగా ఉన్నామని అనుష్క అంటోంది. అయితే ఆమె చెప్పినట్లు ఇప్పుడు థియేటర్‌కు వచ్చి అనుష్క సినిమాను ఎంజాయ్ చేస్తుందా అంటే లేదనే చెప్పాలి.
ఇంట్లోనే హోం థియేటర్‌లోనే, స్క్రీన్ మీదనో చూస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే తన రీసెంట్ సినిమా ‘ఘాటి’ గురించే ఆమె బయటకు రాలేదు. ఆడియో ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చింది. వివిధ కారణాల వల్ల మీడియా ముందుకు, ప్రజల ముందుకు రావడం లేదు. మరిప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా విషయంలో ఏం చేస్తుందో చూడాలి.