పాపం “జై లవకుశ”లో జూనియర్ ఎన్టీయార్ సరసన కథానాయికగా నటించే అవకాశం వచ్చేసరికి ఎగిరి గెంతేసిన నివేదా థామస్ సినిమా రిలీజయ్యాక తన క్యారెక్టర్ లెంగ్త్ అండ్ ఇంపార్టెన్స్ చూసుకొని సిగ్గుతో కుచించుకుపోయింది. “జెంటిల్మన్, నిన్ను కోరి” చిత్రాల్లో హీరోలకంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజన్స్ తో అదరగొట్టిన నివేదా.. “జై లవకుశ”లో కేవలం ఒక పాటకి మూడు సన్నివేశాలకి పరిమితం అవ్వడం ఆమెకే నచ్చలేదు. అందుకే పెద్ద సినిమాల్లో చిన్న పాత్రతో సరిపెట్టుకోవడం కంటే.. చిన్న లేదా మీడియం బడ్జెట్ మూవీస్ లో పెద్ద పాత్రలు పోషించడమే ఉత్తమం అని ఫీలై.. తనను వెతుక్కుంటూ వచ్చిన చాలా పెద్ద సినిమాల ఆఫర్లు కాదని శర్వానంద్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకొంది.
ఇటీవల “మహానుభావుడు”తో బంపర్ హిట్ కొట్టి.. దసరా విన్నర్ గా నిలిచిన శర్వానంద్ త్వరలో “స్వామిరారా” ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుండగా.. అందులో శర్వా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేయనున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా.. ఒక హీరోయిన్ గా నివేదాను ఇప్పటికే సెలక్ట్ చేశారు. మరో హీరోయిన్ కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న ఈ చిత్రంతో మరోమారు నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోడానికి నివేదా వెయిట్ చేస్తోంది.