శుక్రవారం నాడు కంటెంట్ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలే విడుదలవుతున్నాయి. కానీ వేటికీ అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో లేకపోవడం ట్రేడ్ ని ఆందోళనకు గురి చేస్తోంది. మూడు వారాల క్రితం తమిళంలో విడుదలై ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ‘లవ్ టుడే’ సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరగడం లేదు.
అయితే మొదటిరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నా.. వీకెండ్ నాటికి హౌస్ ఫుల్స్ పడడం ఖాయమని ఆయన నమ్ముతున్నారు. తమిళ వెర్షన్ ని ఆన్ లైన్ లో చాలా మంది చూసేయడంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు లేరు. అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. కానీ సీరియస్ ఫిల్మ్ కావడంతో ఫస్ట్ డే టాక్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇందులో కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ చెబుతున్నా.. జనాలకు మాత్రం ఇది సీరియస్ జోనర్ సినిమాలనే అనిపిస్తుంది. అందుకే హిట్ టాక్ వస్తే చూద్దామని బుకింగ్స్ పెద్దగా చేసుకోవడం లేదు. ఇక వరుణ్ ధావన్ నటించిన ‘భేడియా’ను తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ.. మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకి ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి!
పాజిటివ్ టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్లకు వెళ్లేలా కనిపించడం లేదు. గతవారం వచ్చిన ‘మసూద’ ఇప్పుడు కూడా బాగానే నడుస్తోంది. ‘యశోద’ కూడా కలెక్షన్స్ పరంగా బాగానే నెట్టుకొస్తోంది. ‘గాలోడు’ సినిమాను బీ, సి సెంటర్స్ నుంచి తీసేలా లేరు. ఈ సినిమాలను దాటుకొని కొత్త సినిమాలు నిలబడతాయేమో చూడాలి!