అసలు శుక్రవారం వచ్చిందంటే చాలు ఐమాక్స్ మరియు సింగిల్ స్క్రీన్స్ దగ్గర వాలిపోయేవాళ్లు కోకొల్లలు. ఈరోజు కనీసం రెండు సినిమాలు చూడకపోతే ముద్ద దిగని క్యాండేట్లు ఇంకెందరో. 2018లో వారానికి తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషా చిత్రాలు కలగలిసి కనీసం మూడు నాలుగు విడుదలయ్యేవి. కానీ.. 2019లో సినిమా అభిమానులకు ఆ ఛాన్స్ దక్కడం లేదు. సంక్రాంతి సీజన్ మొత్తం పెద్ద హీరోల సినిమాలంటూ చిన్న సినిమాలు విడుదలవ్వలేదు. బాలీవుడ్ నుంచి కూడా “ఉరి” తప్ప మరో ఆకట్టుకొనే సినిమా విడుదలవ్వలేదు. ఇక హాలీవుడ్ నుంచి అయితే సినిమాలే రావడం లేదు. జనవరి మొత్తం అలాగే ముగిసిపోయింది.
కనీసం ఫిబ్రవరిలోనైనా ఏమైనా ఉంటుందేమో అనుకుంటే.. నేడు (ఫిబ్రవరి) ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా రిలీజ్ కూడా లేదు. ఇక హిందీ నుంచి కూడా ఆకట్టుకోనే స్థాయి సినిమాల్లేవు. దాంతో ఈ శుక్రవారం కూడా సినిమాల్లేవని బాధపడుతున్నారు ప్రేక్షకులు. ఇక వచ్చేవారమైన ఉంటాయో లేదో అని టెన్షన్ పడుతున్నారు. అయినా.. ఒకేసారి పోటీపడి మరీ అయిదారు సినిమాలు విడుదల చేసే చిన్న సినిమాల నిర్మాతలు ఇలా ఒక వీకెండ్ మొత్తాన్ని ఖాళీగా ఎందుకు వదిలేస్తారో ట్రేడ్ వర్గాలకు కూడా అర్ధం కావడం లేదు.