ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, జనసేన నాయకుడు, పృథ్వీరాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో న్యాయస్థానం ఈ మేరకు వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విషయంలో న్యాయస్థానం ఎదుట పృథ్వీరాజ్ గైర్హాజరయ్యారు. దీంతో పృథ్వీరాజ్‌పై విజయవాడ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో విజయవాడ ఫ్యామిలీ కోర్టులో పృథ్వీపై అతని భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విషయంలో విచారణ జరిపిన కోర్టు ఆమెకు నెలకు రూ.8 లక్షలు మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై పృథ్వీరాజ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జరిపిన విచారణలో నెలకు రూ.22 వేలు చెల్లించడంతో పాటు అప్పటివరకు ఉన్న బకాయిలు కూడా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదని భార్య శ్రీలక్ష్మి ఆరోపించారు.
ఈ మేరకు ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో మరోసారి పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణకు పృథ్వీరాజ్ హాజరు కాకపోవడంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు న్యాయమూర్తి కె.సునీత బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేశారు. మరి ఈ సారైనా పృథ్వీరాజ్ విచారణకు హాజరవుతారా, లేక లీగల్ చర్యల వరకు ఈ కేసు వెళ్తుందా అనేది చూడాలి.
ఇప్పటికే ప్రొఫెషనల్ లైఫ్‌లోను, పొలిటికల్ కెరీర్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పృథ్వీరాజ్.. ఇలా పర్సనల్ లైఫ్‌లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. సినిమా, పొలిటికల్ కెరీర్‌లో ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నారు. మరి పర్సనల్ లైఫ్‌లో కూడా సెట్ అవ్వాల్సి ఉంది. ఈ మేరకు ఆయన ఏం చేస్తారో చూడాలి.