నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

“ఆహా”లో 11th అవర్ తర్వాత తమన్నా నటించిన మరో వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ హాట్ స్టార్ యాప్ లో విడుదలైంది. 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ థ్రిల్లర్ కు ఇంద్ర సుబ్రమణీయన్ దర్శకుడు. మే 20 నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: ఆల్జైమర్స్ కారణంగా మెల్లమెల్లగా మతిస్థిమితం కోల్పోతున్న తండ్రి, ఆయనకి ఆపరేషన్ చేయించాలంటే డబ్బు కావాలి, డబ్బు కోసం పాత ఇల్లు అమ్మాలి. ఇల్లు అమ్మాలంటే తండ్రి స్వయంగా వచ్చి రిజిష్టార్ ఆఫీస్ లో సంతకం చేయాలి. అందుకు తండ్రి అంగీకరించడం లేదు. ఇన్ని తలనొప్పులతో వేగుతుంటుంది అనురాధ (తమన్నా). ఎథికల్ హ్యాకర్ అయిన అను, స్వాతంత్రం తర్వాత ఇప్పటివరకూ పోలీస్ స్టేషన్స్ లో రిజిష్టర్ అయిన ఎఫ్.ఐ.ఆర్ లను డిజిటలైజ్ చేసే పనిలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే.. పర్సనల్ లైఫ్ లోనే కాక ప్రొఫెషనల్ లైఫ్ లోనూ అనురాధకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ సరిపోవు అన్నట్లు.. తండ్రి ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఒకప్పటి పాపులర్ క్రిమినల్ నవల్ రైటర్ అయిన ఆయన్ను సదరు క్రైమ్ నుంచి అను ఎలా బయటపడేలా చేసింది? అందుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఎటువంటి మలుపులు తిప్పింది? అనేది “నవంబర్ స్టోరీ” కథాంశం.

నటీనటుల పనితీరు: “ఊసరవెల్లి” చిత్రంతోనే నటిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న తమన్నా, “నవంబర్ స్టోరీ”లో మరింత మెచ్యూరిటీ కనబరిచింది. తమన్నా గ్లామర్ తో కాక కేవలం హావభావాలతో అలరించిన మొదటి ప్రయత్నం ఇదేనేమో. అను క్యారెక్టర్ లో ఒదిగిపోయింది తమన్నా. అనారోగ్యంతో బాధపడే తండ్రిని జాగ్రత్తగా చూసుకునే కూతురిగా, ఇంటి పెద్దగా ఆమె నటన సిరీస్ కి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది.

తమిళ నటుడు పశుపతి చాలా రోజుల తర్వాత ఒక అర్ధవంతమైన పాత్రలో కనిపించారు. ఆయన పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే కాబట్టి ఆయన క్యారెక్టర్ ను జనాలు బాగానే గుర్తుపడతారు. ఆయన పోషించిన కీలకపాత్ర సిరీస్ ను మలుపు తిప్పింది, మంచి వేల్యూ యాడ్ చేసింది. అయితే.. ఆయన ఇదివరకే ఈ తరహా పాత్రలు చాలా చేసి ఉండడంతో కొత్తదనం ఎక్కడా కనిపించదు. తండ్రి పాత్రలో సీనియర్ నటులు జీ.ఎం.కుమార్ జీవించేశారు. వివేక్ ప్రసన్న, అరుల్ దాస్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఇంద్ర సుబ్రమణీయన్ రాసుకున్న కథలో ఉన్న ఇంపాక్ట్ కథనంలో మిస్ అయ్యింది. దాదాపు 40 నిమిషం గల ఒక్కో ఎపిసోడ్ తో ఆసక్తి రేపలేకపోయాడు. పాత్రల తీరుతెన్నులు డిజైన్ చేసుకున్నా విధానం బాగున్నప్పటికీ, సదరు పాత్రల క్యారెక్టర్ ఆర్క్స్ ను ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు. పశుపతి పోషించిన బిడ్డ యేసు క్యారెక్టర్ ను చాలా డెప్త్ గా మొదటి ఎపిసోడ్ నుంచి ఎలివేట్ చేసుకుంటూ వచ్చి.. అతడు చేసే పనులకి జస్టీఫికేషన్ మాత్రం చాలా సిల్లీగా ఇచ్చాడు. అందువల్ల ఆరవ ఎపిసోడ్ వరకూ ఏర్పడ్డ కాస్తంత ఆసక్తి కూడా చివరి ఎపిసోడ్ కి పోతుంది. హాలీవుడ్ సినిమాల స్పూర్తి ఎక్కువగా కనిపించింది. రీజనల్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీసే సినిమా/సిరీస్ లో హాలీవుడ్ స్పూర్తి ఉన్నప్పటికీ.. దాన్ని తెలుగీకరించడం లేదా తమిళీకరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులో ఇంద్ర ఫెయిల్ అయ్యాడు. అద్భుతమైన క్యాస్టింగ్ దొరికినప్పటికీ.. వాళ్ళని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయాడు.

సంగీత దర్శకుడు శరణ్ రాఘవన్ కూడా సిరీస్ కి తన 100% ఇవ్వలేదు. సన్నివేశాన్ని తన నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు. చాలా సన్నివేశాల్లో అద్భుతమైన ఎమోషన్ & ఇంటెన్సిటీ ఉన్నప్పటికీ.. పూర్ బీజీయమ్ కారణంగా అవి ఎలివేట్ అవ్వలేదు. అలాగే సౌండ్ మిక్సింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమాటోగ్రాఫర్ విధు అయ్యన్న ఒక్కడే సినిమాకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా కనిపించాయి. అలాగే లైటింగ్ & డి.ఐ విషయంలోనూ అతడి ప్రతిభను మెచ్చుకోవాలి.

సినిమాటోగ్రఫీ తర్వాత ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. మార్చురీ గదిని, హాస్పిటల్ మరియు శవాలను అత్యంత సహజంగా చూపించారు. ముఖ్యంగా పోస్ట్ మార్టం సీన్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి. అందుకు కారణం ఆర్ట్ డిపార్ట్ మెంట్.

విశ్లేషణ: హాట్ స్టార్ లో ఇదివరకు వచ్చిన “లైవ్ టెలికాస్ట్” కంటే చాలా బెటర్ ప్రోడక్ట్ “నవంబర్ స్టోరీ”. అయితే.. ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్ కథనం ఆసక్తిని క్రియేట్ చేయడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయింది. సో, మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా కాస్త ఓపికతో ఒకసారి చూడొచ్చు ఈ సిరీస్ ను. తమన్నా నటన, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఈ సిరీస్ కు మెయిన్ హైలైట్స్.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus