ఆమె ఓ హాలీవుడ్ హీరోయిన్.. పాపులర్ కాకపోయినా చేసిన మంచి పాత్రలు, ఆ పాత్రలు పోషించేప్పుడు ఆమె చూపిన పరిణితికి మంచి నటి అనే బిరుదు కూడా సంపాదించుకుంది. బహుశా అది చూసే రాజమౌళి తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ప్రియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం సెలక్ట్ చేసుకున్నాడు. ఆమె మరెవరో కాదు “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా సెలక్ట్ అయిన డైసీ ఎడ్గర్ జోన్స్. మరికొన్ని రోజుల్లో ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. కుటుంబ సమస్యల కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకొంటున్నట్లుగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె ఆ పోస్ట్ చేసిన గంటలోపే ఆర్.ఆర్.ఆర్ బృందం కూడా ఆమె నిష్క్రమణను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఆమె ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి, అది కూడా ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశాన్ని వాదులుకోవడం ‘కొంతమంది’ ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే ఆమెను తిట్టడం, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఆమె ఫోటోలు షేర్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు.
ఆ రచ్చ ఏ రేంజ్ కి వెళ్ళిందంటే.. అసలే డిప్రెషన్ లో ఉన్న డైసీ జోన్స్ ను ఇంకాస్త బాధపెట్టే స్థాయికి చేరుకున్నాయి ట్రోల్స్. ఆఖరికి డైసీ జోన్స్ స్నేహితులు కొందరు “ఆమెకు చాలా సమస్యలున్నాయి.. దయచేసి ఆమెను ఒంటరిగా వదిలేయండి” అని రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోయింది. దాంతో డైసీ ఎడ్గర్ జోన్స్ ఆన్లైన్ ప్రపంచానికి దూరంగా ఉంటోంది. పాపం.. కుటుంబ సమస్యల కారణంగా తప్పుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఆమెను ఇలా ఇబ్బందిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు.