ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత సాయంత్రం వచ్చే టాక్ ను బట్టి మరుసటి రోజు కలెక్షన్స్ ఉండేవి. కానీ.. ఇప్పుడు మొత్తం సినారియో మారిపోయింది. సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలేమో బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతుండగా.. యావరేజ్ లేదా ఫ్లాప్ అని విశ్లేషకులు డిక్లేర్ చేయబడిన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ” అందుకు నిదర్శనం. విశ్లేషకులు ఏకీపాడేసిన “వినయ విధేయ రామ” థియేటర్లేమో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తుండగా.. విశ్లేషకులతోపాటు ఒకవర్గం ప్రేక్షకులు కూడా అద్భుతం, మహాద్భుతం అంటూ ఆకాశానికెత్తిన “ఎన్టీఆర్ కథానాయకుడు” మాత్రం కనీస స్థాయి వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. తొలివారంలో కేవలం 19 కోట్ల గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం. ఇందుకు కారణాలు ఎంటనేది ఒక్కొక్కరూ ఒక్కోటి చెబుతున్నప్పటికీ.. ముఖ్యమైన రీజన్స్ వేరు అని చెబుతున్నారు.
మొదటిగా నందమూరి అభిమానులు సైతం ఈ చిత్రంపై ఆసక్తి చూపలేదు. ఫస్ట్ కలెక్షన్స్ అందుకు నిదర్శనంగా నిలిచాయి. కేవలం నందమూరి అభిమానులు చూసినా మొదటి రోజే 10 కోట్లు కలెక్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఇక రెండోది సినిమా కంటెంట్ ను సరిగా పబ్లిసిటీ చేయలేదు. ఇక మూడోది.. సినిమాలో సగానికి పైగా ఎన్టీఆర్ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను రీక్రియేట్ చేయడం మీద పెట్టిన శ్రద్ధ “మహానటి” తరహాలో ఆయన పర్సనల్ లైఫ్ ను ఎక్కువగా చూపించలేదు. అందువల్ల రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కూడా సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోయారు. ఈ కారణాల వల్ల సినిమాకి మినిమమ్ కలెక్షన్స్ లేకుండాపోయాయి. మరి సెకండ్ పార్ట్ అయినా కమర్షియల్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.