జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించారు. అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో కొంచెం బరువుపెరగాల్సి వచ్చింది. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ మూడు నెలల గ్యాప్ ఇవ్వడానికి బలమైన కారణం ఉంది. అదే లుక్. తన గత చిత్రాల్లోకంటే ఈ సినిమాలో కొత్తగా కనిపించాలని తారక్ సంకల్పించారు.
అంతేకాకుండా కథకనుగుణంగా స్లిమ్ గా ఉండాలని డైరక్టర్ చెప్పడంతో ఎన్టీఆర్ మూడు నెలల క్రితం లక్ష్యంపై గురిపెట్టారు. ప్రతి రోజూ డైట్ ఫాలో అవుతూ.. నాలుగు గంటలపాటు జిమ్ లో గడిపారు. దీంతో ఒకటి కాదు రెండుకాదు.. దాదాపు ఇరవై కిలోల బరువు తగ్గి అదరగొట్టారు. ఐపీఎల్ సీజర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్.. ఈ సీజన్ ప్రోమో రిలీజ్ వేడుకలో ఈ విషయాలను వెల్లడించారు. “మూడు నెలల్లో 20 కిలోల బరువు తగ్గాను. ఇంకా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. కష్టమే అయినా డైట్ తప్పడం లేదు” అని ఎన్టీఆర్ చెప్పారు. త్రివిక్రమ్ సినిమాలో, రాజమౌళి సినిమాలో కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతోనే ఇంతగా శ్రమిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.