నటరత్న ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన, మరపురాని చిత్రాలున్నాయి.. జానపద, పౌరాణికాలే కాకుండా సాంఘిక చిత్రాల్లోనూ తనదైన శైలిలో ప్రేక్షకాభిమానులను అలరించారాయన. కథ, పాత్రకు తగ్గట్టు సినిమా సినిమాకీ వైవిధ్యం చూపించడంలో ఆయనకు ఆయనే సాటి.. తారక రాముడు నటించిన వాటిలో ‘బడిపంతులు’ మూవీకి ఓ ప్రత్యేకత ఉంది. 1972 నవంబర్ 23న విడుదలైన ‘బడిపంతులు’ 2022 నవంబర్ 23 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన కొన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్, అంజలీ దేవి ప్రధాన పాత్రల్లో.. త్రివేణి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పి.పేర్రాజు నిర్మాణంలో.. పి.చంద్ర శేఖర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘బడిపంతులు’.. 1958లో వచ్చిన కన్నడ చిత్రం ‘స్కూల్ మాస్టర్’ ఆధారంగా తెరకెక్కింది.
ఎన్టీఆర్ వయసుపైబడిన మాస్టరు పాత్రలో కనిపించడం అప్పట్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది..
కథ..
హెడ్ మాస్టరు రాఘవరావు (ఎన్టీఆర్), భార్య జానకి (అంజలీ దేవి) తో కలిసి నిజాయితీగా, విలువలతో కూడిన జీవితం గడుపుతుంటాడు. సత్యం (రామకృష్ణ), వేణు (కృష్ణంరాజు) ఆయన కుమారులు.. లక్ష్మీ (టి.పద్మిని) కుమార్తె.. మాస్టారు కష్టపడి ఓ ఇల్లు కొనుక్కున్నప్పటికీ.. రిటైర్ అయిన తర్వాత పిల్లల దగ్గర ఉండాల్సి వస్తుంది.. కొడుకులిద్దరూ.. తల్లిని ఒకరు, తండ్రిని మరొకరు వంతుల వారీగా చూసుకుంటారు. వీళ్లకి తమ మనవరాలు (వేణు కుమార్తె), పూర్వ విద్యార్థి, పోలీసు అధికారి అయిన రాము (జగ్గయ్య) ఎలా సాయం చేశారనేది మిగతా కథ..
బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్‌కి ఫిలింఫేర్..
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా అలరించిందీ చిత్రం.. అందుకే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద వయసులో దూరంగా ఉంటున్న వృద్ధదంపతులు పడే ఆవేదన ప్రేక్షకుల హృదయాలను కలచివేస్తుంది. రామారావు, అంజలీ దేవిల నటన ఆకట్టుకుంటుంది. రాజబాబు, రమాప్రభల కామెడీ బాగుంటుంది. ఈ చిత్రంలోని నటనకు గానూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు. కె.వి.మహదేవన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.. పాటలను ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య, సి. నారాయణ రెడ్డి రాయగా ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడారు. డి.వి.నరసరాజు మాటలు రాశారు.
శ్రీదేవి బాలనటిగా…
అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల చేత ఆరాధించబడడమే కాక.. సౌత్‌లోనే నంబర్ వన్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన శ్రీదేవి.. ఈ చిత్రంలో బాలనటిగా కనిపించారు. తర్వాత ఈ మూవీలో తనకు తాతగా చేసిన ఎన్టీఆర్‌తో కలిసి పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తండ్రిగా కనిపించిన కృష్ణంరాజుతోనూ ఆమె జతకట్టడం విశేషం.