“లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” ఫేమ్ సుధాకర్ కొమాకుల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “నువ్వు తోపురా”. గత ఏడాది కాలంగా విడుదలకు ఇబ్బందిపడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (మే 3) విడుదలైంది. అమెరికాలో ఉనికి చాటుకోవడం కోసం ప్రయత్నించిన ఓ యువకుడి కథాంశంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: సరూర్ నగర్ సూరి (సుధాకర్ కొమాకుల) లోకల్ కుర్రాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి చాలా రగ్గడ్ గా పెరుగుతాడు. ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగడం, తిరగడం మినహా పెద్దగా లైఫ్ లో గోల్స్ లేకుండా తిరుగుతుంటాడు. ఆ క్రమంలోనే రమ్య (నిత్యాశెట్టి) పరిచయమవుతుంది. ఇద్దరి నడుమ ప్రేమ చిగురిస్తుంది.. ఆ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లకముందే సూరికి ఇంకా సెటిల్ మెంట్ లేదనే కారణంతో రమ్య తల్లిదండ్రులు సూరిని రిజెక్ట్ చేస్తారు.
ప్రేమించిన అమ్మాయి మాత్రమే కాక.. సొంత చెల్లెలు కూడా తాను సెటిల్ అవ్వలేదనే విషయంలో దెప్పి పొడుస్తుందనే కోపంతో అమెరికా వెళ్తాడు. అక్కడ బ్రతకడం కోసం ఎంత కష్టపడ్డాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది “నువ్వు తోపురా” కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరించిన సుధాకర్ ఇంకా “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” నాగరాజ్ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా అనిపించేలా ఉంది సుధాకర్ పాత్ర మరియు పాత్రశైలి. ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులను మళ్ళీ అదే తరహా క్యారెక్టరైజేషన్ తో మెప్పిస్తానని అనుకున్నాడో సుధాకర్ కే తెలియాలి. నటుడిగా పాత్రకు న్యాయం చేశాడు కానీ ప్రేక్షకుల్ని మాత్రం మెప్పించలేకపోయాడు.
నిత్యాశెట్టి నటిగా ఒకే కానీ.. హీరోయిన్ గా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తల్లి పాత్రలో నిరోష పర్వాలేదనిపించుకొంది. సహాయ పాత్రలో వరుణ్ సందేశ్ ను చాలారోజుల తర్వాత తెరపై కనిపించడం విశేషం. తన పాత్రకు మాత్రం న్యాయం చేశాడు. రవివర్మ నెగిటివ్ షేడ్ రోల్ కి, మరో సహాయ పాత్రకి జెమిని సురేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.
సాంకేతికవర్గం పనితీరు: రెండేళ్ల క్రితం సినిమా కావడంతో కెమెరా వర్క్ మినహా.. సంగీతం కానీ, ఎడిటింగ్ వర్క్ కానీ చాలా పాతవిగా కనిపిస్తాయి. అమెరికాలో నేచురల్ లైటింగ్ వల్ల అక్కడ షూట్ చేసిన పార్ట్ వరకూ ఒకే కానీ మిగతా షాట్స్ అన్నీ పేలవంగా ఉంటాయి.
పాటలు ఆకట్టుకోలేకపోయాయి, లిరిక్స్, సంభాషణలు రిపీటెడ్ గా ఉన్నాయి. దర్శకుడు హరినాథ్ బాబు రాసుకొన్న కథ-కథనంలో కొత్తదనం కొరవడింది. సినిమా మొత్తంలో ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేవు. దాంతో సినిమా చాలా పేలవంగా సాగుతుంది. అందువల్ల ప్రేక్షకుడు సినిమాకి ఎంగేజ్ అవ్వలేక, ఎంటర్ టైన్ అవ్వలేక ఇబ్బందిపడతాడు. దర్శకుడి ఆలోచన, బృందం కష్టం తెరపై కనిపిస్తున్నా.. వాటిని ఎంజాయ్ చేసే మూడ్ లో ప్రేక్షకుడు ఉండదు.
విశ్లేషణ: హీరోగా హిట్ కొట్టాలన్న సుధాకర్ కొమాకుల ఆశ “నువ్వు తోపురా”తో నెరవేరలేదనే చేప్పాలి. వచ్చేవారం “మహర్షి” రిలీజ్ కి రెడీగా ఉండడం, ఆల్రెడీ థియేటర్లలో “అవెంజర్స్, జెర్సీ, మజిలీ” చిత్రాలు హల్ చల్ చేస్తూనే ఉండడంతో ఈ చిత్రం కమర్షియల్ గా సేఫ్ జోన్ కు చేరుకోవడం కూడా కష్టమే.
రేటింగ్: 1.5/5