సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం సర్వసాధారణం. అయితే కొంతమంది దాంతోపాటు మ్యూజికల్ నైట్‌లు కూడా నిర్వహిస్తున్నారు. మొన్నీ మధ్య వచ్చిన ‘కూలీ’ సినిమా సమయంలో అనిరుధ్ రవిచందర్ కూడా ఇదే పని చేశారు. ఓ పెద్ద ఈవెంట్‌లో సినిమా పాటను విడుదల చేశాడు. అంతెందుకు ‘ఓజీ’ సినిమా కోసం ఓ పాటను సంగీత దర్శకుడు తమన్ కూడా ఇదే పని చేశారు. ఇప్పుడు మరోసారి తమన్ ఇదే ప్లాన్ చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సంగీత తుపాను పుట్టనుంది.
‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 21న అంటే ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఈవెంట్ జరగొచ్చు అనే వార్తలు రాగా.. ఇప్పుడు హైదరాబాద్‌నే వేదికగా చేసుకున్నారు. ఆదివారం ఉదయం 10:08 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సాయంత్రం ఈవెంట్ పెడతారు. దీంతో సండే పవన్ ఫ్యాన్స్‌కి డబుల్ బొనాంజా దొరుకుతుందన్నమాట.
అయితే ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రచారం కూడా ఆ దిశగానే ఉంది. ‘ఓజీ’ వేదిక మీద టాలీవుడ్ ‘ఓజీ’లు ఇద్దరూ ఉంటే చూసి మురిసిపోవాలి అనేది వారి ఉద్దేశం. మరోవైపు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అంటే చిరంజీవికి ఎనలేని అభిమానం. ఆయన కూడా అంతే ప్రేమ చూపిస్తుంటారు. ఈ రెండు కాంబినేషన్ల వల్ల చిరు వస్తారేమో చూడాలి.
ఇక మెగా కుటుంబ యువ హీరోలు అందరూ వస్తారని ఫిక్స్ అయిపోవచ్చు. వీరు కాకుండా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్‌లో సినిమాలు ఉన్న హీరోలు, దర్శకుడు సుజీత్‌తో పరిచయం, అనుబంధం ఉన్న హీరోలు కూడా వస్తారని లెక్కలేస్తున్నారు. చిత్రబృందం ఎలానూ వస్తుంది. చూడాలి మరి తమన్ అండ్ కో. ఎలాంటి సందడి చేస్తారో?