‘పవన్ కల్యాణ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా సినిమా’… ‘ఓజీ’ సినిమా గురించి గత కొన్ని ఏళ్లుగా ఇదే మాట వింటూ ఉన్నాం. సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ వచ్చినప్పుడు కూడా ఇదే తేలింది. సినిమా పోస్టర్లలో తమిళం, హిందీ, మలయాళ, కన్నడ, తెలుగు అంటూ మూడు భాషల పేర్లను కూడా రాసుకొచ్చారు. గ్లింప్స్, సాంగ్ కూడా ఆయా భాషల్లో కాస్త ఆలస్యమైనా విడుదల చేశారు. అయితే ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికైతే పాన్ ఇండియా కాదు.
కావాలంటే మీరే చూడండి సినిమా టీమ్ నుండి ఇప్పుడు వస్తున్న ప్రచార చిత్రాల్లో చూస్తే మిగిలిన భాషల పేర్లన్నీ మిస్ అయిపోయాయి. సినిమా ట్రైలర్‌ని తొలుత కేవలం తెలుగు భాషల్లోనే రిలీజ్ చేశారు. దానర్థం ఈ సినిమా కేవలం మనకు మాత్రమే. అంటే పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా రిలీజ్ ఈ సినిమతో కూడా వర్కవుట్ కావడం లేదన్నమాట. ‘హరి హర వీరమల్లు’ సినిమా సమయంలోనూ ఈ ప్రయత్నం జరిగినా అప్పుడు కూడా వర్కవుట్ కాలేదు.
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా సుజీత్ తెరకెక్కించిన సినిమా ‘ఓజీ’. పవన్ కల్యాణ్ సినిమాల్లో ఈ స్థాయిలో హైప్‌ని అందుకున్న సినిమా ఇప్పటివరకు ఏదీ రాలేదు అనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. దానికితోడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పవర్ స్టార్‌గా, ఆందీ (తుపాన్)గా దేశం మొత్తం ఆయన ఇప్పుడు పరిచయం. కానీ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయడం లేదు.
దీనికి కారణం సినిమా ఇతర భాషల పనులు ఇంకా అవ్వకపోవడమే అని సమాచారం. తొలుత సమయం సరిపోతుంది అని అనుకున్నా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇతర భాషల పనులు చూసుకుంటే ఇబ్బంది అవుతుంది అని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేద్దామని నిర్మాణ సంస్థ ఫిక్స్ అయిందని సమాచారం. అయితే 22న సుమారు అర్ధరాత్రి హిందీ ట్రైలర్ వచ్చింది. మరి సినిమాను ఒకేసారి తీసుకొస్తారా? లేక ఆలస్యం చేస్తారా? అసలు పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందా అనేది చూడాలి.