Oke Oka Jeevitham Review: ఒకే ఒక జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 9, 2022 / 11:14 AM IST

గత నాలుగేళ్లుగా ఒక హిట్ సినిమా కోసం పడిగాపులు కాస్తున్న శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఒకే ఒక జీవితం”. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైమ్ ట్రావెల్ నేపధ్యంలో రూపొందడం విశేషం. మరి ఈ సినిమాతోనైనా శర్వా తన లాంగ్ పెండింగ్ సక్సెస్ ను అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పటినుండి తల్లితో విశేషమైన అనుబంధం ఉన్న కుర్రాడు ఆది (శర్వానంద్). తన స్నేహితులు చైతన్య (ప్రియదర్శి), శీను (వెన్నెల కిషోర్)తో కలిసి సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ.. తన తల్లి తనతో లేదనే విషయంలో బాధపడుతూ ఉంటాడు.

ఒకానొక సందర్భంలో.. సైంటిస్ట్ పాల్ (నాజర్)ను కలిసినప్పుడు టైమ్ ట్రావెల్ సాధ్యమని తెలుసుకొని.. తన బాల్యానికి తిరిగి ప్రయాణిస్తాడు. 20 ఏళ్ల క్రితం తన బాల్యంలోకి తానే ప్రయాణం చేసిన ఆది-శీను-చైతన్యలు ఎదుర్కొన్న సందర్భాల సమాహారమే “ఒకే ఒక జీవితం” కథాంశం.

నటీనటుల పనితీరు: అమల అక్కినేని తల్లి పాత్రలకు న్యూ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిందని చెప్పాలి. తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, ఆమె అభినయం సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. శర్వానంద్ ఈ సినిమాలో కాస్త డల్ గా కనిపించినప్పటికీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం అదరగొట్టాడు. అతడి కళ్ళల్లోని బాధ, ఆనందం ప్రేక్షకులు కూడా అనుభవిస్తారు.

ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సీన్స్ లో శర్వా నటనకి అద్భుతమైన అప్లాజ్ వస్తుంది. ఇక వెన్నెలకిషోర్-ప్రియదర్శి కామెడీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. చిన్ననాటి తీపి జ్ణాపకాలను గుర్తుచేస్తూనే.. ఆరోగ్యకరమైన హాస్యంతో కడుపుబ్బ నవ్వించారు. నాజర్, రీతువర్మ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. లైటింగ్ & టింట్ కలర్ తో 1990 & 2020 కాలానికి మధ్య వ్యత్యాసాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా తన కెమెరా పనితనంతోనే ఎలివేట్ చేసిన విధానం ప్రశంసనీయం. జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం మనసుల్ని హత్తుకుంటుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది.

దర్శకుడు శ్రీకార్తీక్ ఎంచుకున్న కథ చాలా సాధారణమైనదే అయినప్పటికీ.. ఆ కథను నడిపించిన విధానం, ముఖ్యంగా 1990 నాటి జ్ణాపకాలను గుర్తుచేసిన తీరు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే.. మదర్ సెంటిమెంట్ విషయంలో అతి చేయకుండా.. సినిమాకి కావాల్సినంత మాత్రమే వినియోగించుకొని ఆడియన్స్ సినిమాలో బాగా కనెక్ట్ అయ్యేలా చూసుకున్నాడు. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త క్రిస్ప్ గా వ్యవహరించి ఉంటే బాగుండేది అనిపించింది.

విశ్లేషణ: “మహానుభావుడు” తర్వాత 4 ఏళ్లకి మళ్ళీ శర్వానంద్ హిట్ కొట్టాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్నీ వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడమే కాక.. వెన్నెల కిషోర్ & ప్రియదర్శిల కామెడీని విశేషంగా ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ మొదటివారం “రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో”తో డల్ అయిన తెలుగు సినిమా బాక్సాఫీస్.. “ఒకే ఒక జీవితం”తో మళ్ళీ పుంజుకోవడం ఖాయం!

రేటింగ్: 3/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus