తమ అభిమానం హీరోతో కలిసి ఓ ఫోటో దిగాలని ప్రతీ ఒక్క అభిమానికి ఉంటుంది. కానీ హీరోలు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఫోటో దిగడానికి తగిన సమయం… అలాగే అక్కడ జనాల్ని కంట్రోల్ చేసే సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. లేదంటే చాలా కష్టమవుతుంది. చాలా తొక్కిసలాటలు కూడా జరుగుతాయి. అందుకే హీరోలు సైతం కొంచెం అభిమానుల పై అరుస్తూ.. అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తారు. అలాగే హీరోల టైం కూడా చాలా ముఖ్యమైంది. ఏమాత్రం సమయం వృధా అయినా దర్శక నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హీరోలు.. తమ అభిమానుల పట్ల తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మొన్నటికి మొన్న వెంకటేష్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానిని కలిసి.. ఆ అభిమానికి మనోధైర్యాన్ని నింపాడు. ఇక మహేష్ బాబు సైతం శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి(12) అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతుంటే.. స్వయంగా శ్రీకాకుళం వెళ్ళి… పర్వీన్‌ని కలిసి కొంత సమయం గడిపి ఆ పాపకి దైర్యం చెప్పాడు. ఇప్పుడు ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరడం విశేషం.
ఈరోజు బన్నీ-త్రివిక్రమ్ చిత్రం పూజా కార్యక్రమాల్ని జరుపుకుంది. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు.. మెగా అభిమానులను మాత్రమే కాదు అందరి ప్రేక్షకుల్ని కూడా ఆనందోత్సాహంలో ముంచెత్తుతోంది. ఓ ఇద్దరు దివ్యాంగులు.. ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో వేచిచూస్తూ కారు ఆపి తమతో ఫొటో దిగాలని కోరారు. కారు నుండీ చూస్తూ.. ఆ ఇద్దరినీ గమనించిన బన్నీ.. వెంటనే కారు ఆపమని చెప్పి.. కారు దిగి వారిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటో దిగాడు బన్నీ. దీంతో ఆ దివ్యాంగులు ఎంతో సంబరపడ్డారు. ఈ రకంగా బన్నీలోని సహృదయం, అభిమానుల పట్ల తనకున్న ఆప్యాయత మరోసారి నిరూపించుకున్నాడు. ఇందుకు సంబందించిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.