దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన వెండి తెర కళా ఖండానికి మరో అరుదైన గౌరవం లభించింది. బాహుబలి : బిగినింగ్ విడుదలై ఏడాది దాటినా ఆ చిత్రంపై క్రేజ్ తగ్గలేదు. స్వదేశ, విదేశాల్లో ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీని పలు జాతీయ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరో అరుదైన గౌరవం బాహుబలికి లభించింది. ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమిట్ లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
భారత్ తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు భాగంగా ఉన్న బ్రిక్స్ సమిట్ సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఢిల్లీ లో జరగనుంది. ఈ సమిట్ లో ప్రతీ దేశం నుంచి నాలుగు సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది భారత్ తరుపున ప్రదర్శనకు అర్హత సాధించిన సినిమాలో బాహుబలి కూడా ఉండటం విశేషం. బాహుబలితో పాటు బాజీరావ్ మస్తానీ, సినిమావాలా(బెంగాళీ), తితీ(కన్నడ) చిత్రాలను విదేశీ ప్రతినిధులు వీక్షించనున్నారు.
బాహుబలి బిగినింగ్ లోని ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు బాహుబలి కంక్లూజన్ సిద్ధమవుతోంది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ మరింత అద్భుతంగా ఉండాలని రాజమౌళి శ్రమిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.