‘డాక్టర్ కాబోయి యాక్టర్’ అయ్యామని చెప్పినవారు చిత్రసీమలో చాలామంది ఉన్నారు. వీరిలో చదువుకునేటప్పుడు అవకాశాలు రావడంతో అనుకోకుండా తెరపైకి వచ్చి అటుపై పుస్తకాలకు స్వస్తి పలికినవారు కొందరైతే జంట పడవల ప్రయాణం చేసినవారు మరికొందరు. బాలనటిగా పలు సినిమాలు చేసి ‘గాయకుడు’ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రీయ శర్మ ‘నిర్మలా కాన్వెంట్’ తో తొలి విజయం అందుకుంది. సాధారణంగా హిట్ కొట్టిన వారెవరైనా వరుస సినిమాలతో బిజీ అయిపోవాలనుకుంటారు. దానికి విరుద్ధంగా ఈ పాప మాత్రం ఏడాదికి రెండు సినిమాలే అని గిరి గీసి కూర్చుంది.
దానికి ఓ కారణం లేకపోలేదు. శ్రియకు చదువంటే చాలా ఇష్టమట. బాలనటి నుండి హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టిన ఈమె ప్రస్తుతం ‘లా’ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ చదువు పూర్తయ్యే వరకు సంవత్సరానికి రెండు సినిమాలే చేస్తానని చెబుతోంది. హీరోయిన్ గనక ఓ సినిమాకి 20 నుండి 30 రోజులు కేటాయిస్తే ఓ సినిమా అయిపోతుంది. ఆ లెక్కన రెండు సినిమాలకి రెండు నెలలంటే తన చదువుకు ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చన్నది ఈ బ్యూటీ ప్లాన్. పదోతరగతి, ఇంటర్ లో శ్రీయ 90 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంది. అలాంటప్పుడు ఆమె తన చదువు కోసం తపన పడటంలో తప్పులేదు. ఇక తర్వాతి సినిమాల గురించి చెబుతూ హిందీ లో ఒకటి చేస్తున్నా తెలుగు, కన్నడలో చర్చల దశలో ఉన్నాయని చెప్పింది.
https://www.youtube.com/watch?v=vCSnxc0PRc0