టాలెంట్ పుష్కలంగా ఉన్న సరైన హిట్ పడక.. తన ఉనికిని చాటుకోవడం కోసం తపిస్తున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా.. ఆశించిన స్థాయి విజయం మాత్రం వరించడం లేదు. దాంతో.. ఇప్పుడు తన తాజా రిలీజ్ “ఊరిపేరు భైరవ కోన” మీద భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. విడుదలైన రెండు పాటలు కూడా జనాల్లోకి బాగా వెళ్ళాయి. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: బసవ లింగం (సందీప్ కిషన్) సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా వర్క్ చేస్తూ ఎప్పటికైనా మంచి పొజిషన్ కి వెళ్లాలని తపిస్తుంటాడు. తన బాబాయ్ కోసం చేసిన ఓ చిన్న తప్పు వల్ల అనుకోని మలుపు తిరుగుతుంది. ఊహించని విధంగా గరుడ పురాణం తో లింక్ అయిన భైరవ కోన అనే ఊరిలో ఇరుక్కుంటాడు బసవ. అసలు భైరవ కోనకి బసవ ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎందుకు ఇరుక్కొవాల్సి వచ్చింది? గరుడ పురాణానికి భైరవ కోనకి సంబంధం ఏమిటి? అక్కడ్నుండి బసవ ఎలా బయటపడ్డాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “ఊరిపేరు భైరవ కోన” చూడాలన్నమాట.
నటీనటుల పనితీరు: సందీప్ కిషన్ ఎలాంటి పాత్రలోనైనా తనదైన ఈజ్ తో జీవించేస్తాడు. ఈ చిత్రంలోనూ బసవ పాత్రలో చాలా హుందాగా నటించాడు సందీప్ కిషన్. అతడి నటన, వాచకం, వ్యవహార శైలి ఎక్కడా అసహజంగా ఉండవు. మోడ్రన్ అమ్మాయిగా కావ్య థాపర్ పర్వాలేదనిపించుకోగా.. గిరిజన యువతిగా వర్ష బొల్లమ్మ ఆకట్టుకోలేకపోయింది. ఆమెకు ఉన్నది లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అయినప్పటికీ.. ఎందుకో చాలా అసహజంగా అనిపించింది.
చాన్నాళ్ల తర్వాత తమిళ సీనియర్ ఆర్టిస్ట్ వడివుక్కరాశి పెద్దమ్మ అనే పాత్రలో ఆకట్టుకుంది. ఆమె డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే.. ఆమె పాత్రలో ఉన్న భారీతనం, ఆమె గొంతులో లేకుండాపోయింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ ల కామెడీ అక్కడక్కడా అలరించింది. రవిశంకర్ తన సీనియారిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: శేఖర్ చంద్ర మరోసారి తన బాణీలతో అలరించాడు. ఉన్నవి రెండు పాటలే అయినప్పటికీ.. రెండూ చార్ట్ బస్టర్స్ కావడం విశేషం. అలాగే.. నేపధ్య సంగీతం విషయంలోనూ తగిన జాగ్రత్త తీసుకున్నాడు శేఖర్ చంద్ర. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట పనితనం కూడా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను కంపోజ్ చేసిన తీరు బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు వి.ఐ.ఆనంద్ కథగా ఎంచుకున్న పాయింట్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నప్పటికీ.. కథనంగా మాత్రం వర్కవుటవ్వలేదు.
ఫస్టాఫ్ వరకూ వరల్డ్ బిల్డింగ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్ లో అదే వరల్డ్ లో జరిగే సంఘటనలు మాత్రం ఆసక్తికరంగా లేవు. అందుకే.. పెద్దగా ఆకట్టుకోవు. కథకుడిగా కంటే దర్శకుడిగా ఆకట్టుకున్నాడు వి.ఐ.ఆనంద్. కొన్ని సందర్భాలు అచ్చెరువుగొలిపేలా ఉండగా.. సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు మాత్రం సరైన లాజిక్ లేక ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోయారు.
విశ్లేషణ: ఆసక్తికరమైన పాయింట్ కి, అంతే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే కూడా ఉండాలి. అలా లేనప్పుడు (Ooru Peru Bhairavakona) సినిమాలో ప్రేక్షకుడ్ని లీనం చేయడం లేదా రెండు గంటలపాటు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం చాలా కష్టం. “ఊరిపేరు భైరవ కోన”లో ఆ ఆకట్టుకొనే కథనం, మంచి ట్విస్టులు లోపించడంతో ఫస్టాఫ్ వరకూ పర్వాలేదనిపించేలా సాగిన సినిమా సెకండాఫ్ లో చతికిలపడింది.
రేటింగ్: 2/5