కరోనా మహమ్మారి మొన్నటివరకు ఇతర దేశాల్లో విలయతాండవం చేయగా ఇప్పుడు ఇండియాను ఎక్కువగా దెబ్బ కొడుతోంది. రోజురోజుకు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓ వైపు లక్షల్లో పాజిటివ్ కేసులు, మరోవైపు వేల సంఖ్యలో మరణాలు. ఏప్రిల్ రెండవ వారం నుంచి ఇండియాలో మరణాల సంఖ్య ఎక్కువవుతోంది. అసలు ఈ రేంజ్ లో మృత్యుఘోష వినిపిస్తుందని ఎవరు ఊహించలేదు. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.
కొన్ని గ్రామాల్లో అంత్యక్రియలకు ఇబ్బందిగా మారడంతో ఒకేసారి క్రేన్స్ తో గుంతలు తవ్వి కుప్పలు కుప్పలుగా శవాలను పూడ్చి పెడుతున్నారు. ఇక స్మశాన వాటికలు వద్ద కూడా డెడ్ బాడీలు క్యూలో ఉండడం కలచి వేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ గా మారింది. సాధారణంగా ఇప్పటివరకు కేవలం సినిమా థియేటర్లకు మాత్రమే హౌజ్ ఫుల్ బోర్డులు చూశాము. కానీ స్మశాన వాటికలకి కూడా హౌజ్ ఫుల్ బోర్డులు తగిలుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బెంగుళూరులోని ఒక స్మశాన వాటిక గేటుకు హౌజ్ ఫుల్ అంటూ బోర్డు వేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ స్థాయిలో కోవిడ్ తో మరణించిన అనాధ శవాలు స్మశాన వాటికకు వస్తున్నట్లు కాటి కాపరులు చెబుతున్నారు.