ఆక్సిజన్

  • November 30, 2017 / 07:18 AM IST

గోపీచంద్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం తనయుడు ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్”. ఫస్ట్ కాపీ సిద్ధమై కూడా గత ఆరేడు నెలలుగా విడుదలకు నోచుకోలేకపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (నవంబర్ 30) విడుదలైంది. అందర్నీ ఆలోచింపజేసే చిత్రమవుతుందని దర్శకుడు జ్యోతికృష్ణ ఎంతో నమ్మకంగా చెప్పిన ఈ చిత్రం ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : రాజమండ్రిలోని రఘుపతి (జగపతిబాబు) కుమార్తె శ్రుతి (రాశీఖన్నా)ను పెళ్లి చేసుకొనేందుకు అమెరికా నుంచి వస్తాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణప్రసాద్ (గోపీచంద్). రఘుపతి కుటుంబ సభ్యులకు తెలియని శత్రువుల వల్ల ప్రాణ గండం ఉండడంతో రెండ్రోజుల్లో పెళ్లి చేసి అల్లుడితోసహా అమ్మాయిని అమెరికా పంపేయాలనుకొంటారు. కానీ.. కారణాంతరాల వలన పెళ్లి మూడు వారాలు పోస్ట్ పోన్ అవుతుంది.

కట్ చేస్తే.. రఘుపతి కుటుంబాన్ని చంపాలనుకొంటున్నవాళ్ళు రఘుపతి అల్లుడు కృష్ణప్రసాద్, కూతురు శ్రుతిని కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ వెనుక చాలా పెద్ద కథ ఉందని తెలుసుకొంటారు ఇన్వాల్వ్ అయిన పోలీసులు. ఏమిటా కథ? ఇంతకీ కృష్ణప్రసాద్ & శ్రుతి ఏమయ్యారు? వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు రఘుపతి కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రమే “ఆక్సిజన్”.

నటీనటుల పనితీరు : మాస్ రోల్స్ ను పండించడంలో సిద్ధహస్తుడైన గోపీచంద్ ఈ చిత్రంలో క్లాస్ గా కనిపిస్తూనే రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పండించాడు. గోపీచంద్ పాత్ర ద్వారా ఇంటర్వెల్ బ్యాంగ్ ను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకుల్ని తప్పకుండా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఇప్పటివరకూ యాక్టింగ్ పరంగా పర్వాలేదు అనిపించుకొన్న రాశీఖన్నా “ఆక్సిజన్”లో మాత్రం జీరో ఎక్స్ ప్రెషన్స్ తో చిరాకు తెప్పించింది. ఆకారం అందంగా కనిపించినా.. నటనపరంగా కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేకపోవడంతో ఆమెను ఆడియన్స్ పెద్దగా పట్టించుకొనే అవకాశం లేదు. అను ఎమ్మాన్యూల్ పాత్ర కాస్త ఎమోషన్ తోపాటు వెయిటేజ్ కూడా ఉన్నది. అయితే.. అమ్మడు వెండితెర నిండుగా కనిపించి, ఒక పాటలో అందాలతో కనువిందు కూడా చేసింది. కానీ.. నటిగా మాత్రం పాత్రను రక్తి కట్టించలేకపోయింది. జగపతిబాబు రెగ్యులర్ రోల్ లో ఎప్పట్లానే స్టైలిష్ గా అలరించాడు. “కిక్” శ్యామ్, అభిమన్యుసింగ్, బాహుబలి ప్రభాకర్, అమిత్ లు పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : ఏ సినిమాకీ లేని స్థాయిలో ఈ సినిమాకి ఏకంగా ఆరుగురు కెమెరామెన్లు వర్క్ చేశారు. క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకపోయినా.. టింట్ యూసేజ్ వల్ల ఏదో రెండు మూడు సినిమాలు చూస్తున్న భావన కలుగుతుంది. యువన్ శంకర్ రాజా ట్యూన్స్ ట్రెండీగా, క్యాచీగా ఉన్నాయి. కానీ.. చిన్నా నేపధ్య సంగీతం మాత్రం ఎమోషన్ ని ఎలివేట్ చేయకపోగా.. కాస్త లౌడ్ గా ఉంది. అలాగే సౌండ్ డిజైనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. మధ్యమధ్యలో గోపీచంద్ కి కూడా ఎవరైనా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారేమో అనిపిస్తుంది. ఇక రాశీఖన్నా క్యారెక్టర్ కి అయితే చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ లేకపోవడం గమనార్హం. అసలు సినిమా రిలీజ్ లేట్ అవ్వడానికి కారణంగా దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పిన గ్రాఫిక్స్ క్వాలిటీ చూశాక ఉసూరుమనిపిస్తుంది. ఈమాత్రం గ్రాఫిక్స్ కోసం 8 నెలలు వెయిట్ చేశారా అనిపిస్తుంది.

దర్శకుడు జ్యోతికృష్ణ ఒక మంచి సోషల్ కాజ్ తో కథ రాసుకొన్న విధానం అభినందనీయం. అయితే.. ఆ కథను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడు. అందుకు కారణం సరైన స్క్రీన్ ప్లే లేకపోవడమే. ఒకట్రెండు ట్విస్టులు, రెండు ఫైట్ సీక్వెన్స్ లు, ఓపెనింగ్ షాట్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకొన్న జ్యోతికృష్ణ కథనంపై కనీస స్థాయి కాన్సన్ ట్రేషన్ కూడా పెట్టకపోవడంతో సినిమా నిడివి అనవసరంగా 156 నిమిషాలు సాగింది. మొత్తానికి “ఆక్సిజన్” చిత్రం ద్వారా ఒక మంచి టెక్నీషియన్ అని ప్రూవ్ చేసుకొన్న జ్యోతికృష్ణ ఒక దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ : మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరోనే “ఎదుటివారికి సహాయపడడం ఒక మనిషి బాధ్యత” అనే అద్భుతమైన మెసేజ్ చెప్తేనే ఆడియన్స్ సరిగా పట్టించుకోలేదు. అందుకు కారణం ఆడియన్స్ కు అభిరుచి లేకపోవడం కాదు, చెప్పిన విధానం ఆకట్టుకోలేకపోవడం. “ఆక్సిజన్” పరిస్థితి కూడా అంతే, ఆరేడు యాక్షన్ సీక్వెన్స్ లు, ఇద్దరు హీరోయిన్స్, రెండు మంచి ట్విస్టులు ఇలా అన్నీ ఉన్నప్పటికీ.. ఆకట్టుకొనే కథనం లేకపోవడంతో ఈ చిత్రం ఆడియన్స్ ను అలరించడం కష్టమనే చెప్పాలి.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus